తల్లిని చంపాడని తండ్రిని చంపాడు!

24 Jul, 2019 10:12 IST|Sakshi

స్నేహితులతో కలిసి..

కుటుంబ పరువు తీస్తున్నాడని ఆగ్రహంతో హత్య 

వరుస ఘటనలతో ఆందోళనలో ఎల్లారెడ్డిపల్లెవాసులు 

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు 

ఇందల్‌వాయి(నిజామాబాద్‌రూరల్‌): అమ్మను చంపడంతో పాటు మద్యానికి బానిసై కుటుంబ పరువు తీస్తున్నాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కొడుకు తన కన్న తండ్రినే హతమార్చిన ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గత ఫిబ్రవరి 16న ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన కుంట గంగబాపు(45) భార్య కుంట విజయను కుటుంబ కలహాల కారణంగా ఆమె పుట్టినిల్లు ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో రోకలితో తలపై బాది హత్య చేసి పరారయ్యాడు. నెల తర్వాత అతడిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపారు. ఇదిలా ఉండగా గల్ఫ్‌ దేశాల నుంచి తల్లి అంత్యక్రియలకు హాజరైన ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు తిరిగి వెళ్లి పోగా చిన్న కొడుకు ప్రశాంత్‌ ఇక్కడే ఉన్నాడు.

మూడు నెలల అనంతరం బెయిలుపై జైలు నుంచి వచ్చిన గంగబాపు తన వైఖరిని మార్చుకోక పోగా మద్యం తాగుతూ బంధువులను, అప్పు ఇచ్చినవారిని తిడుతూ బెదిరిస్తున్న క్రమంలో తండ్రి ప్రవర్తనపై విసుగు చెందిన అతడి చిన్న కొడుకు ప్రశాంత్‌ అతడి బావమరిది సాయికుమార్, స్నేహితుడు తిప్పల రవితో కలిసి సోమవారం వాడి గ్రామం నుంచి తండ్రి గంగబాపును ఎల్లారెడ్డిపల్లెకి తెచ్చి సోమవారం రాత్రి తండ్రిని తీవ్రంగా కొట్టారు. దీంతో గంగబాపు మరణించాడు.

ఇది గమనించిన ప్రశాంత్‌ భయంతో మంగళవారం ఉదయం ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎదుట లొంగిపోయాడు. ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఇందల్వాయి ఎస్‌ఐ రాజశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు, వాడి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులపై విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 ఆరు నెలల్లోనే మూడు హత్యలు
ఈ సంవత్సరంలోనే గ్రామంలో వరుసగా మూడు హత్యలు జరగడంపై ఎల్లారెడ్డిపల్లె గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. భర్త చేతిలో హతమైన విజయ హత్య ఘటన మరువక ముందే ఈనెల 8న గ్రామంలో నాయిడి సాయమ్మ అనే మహిళ తన భర్త నాయిడి గంగారాంను తలపై బాది చంపిన సంఘటన వెలుగు చూసింది. ఇది జరిగిన పక్షం రోజులకే హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగబాపు హత్యకు గురికావడంతో గ్రామస్తులు అభద్రతా భావానికి లోనవుతున్నారు.

ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామంగా నిర్మల్‌ పురస్కారం అందుకున్న గ్రామంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై స్పందించిన సర్పంచ్‌ గుర్రం నరేష్, ఎంపీటీసీ బాపురావు గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాజాతర వంటివి నిర్వహించాలని, తద్వారా ప్రజల్లో హింసాత్మక భావజాలాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకోవాలని సీఐ కోరారు.   

మరిన్ని వార్తలు