సోనియా చలవతోనే తెలంగాణ

17 Nov, 2014 00:46 IST|Sakshi

ఘట్‌కేసర్ టౌన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఇంటి పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సర్వేలపేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు ఎత్తివేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

పార్టీల అభివృద్ధి కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం్య మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్షా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని హామీలిచ్చి 170 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేశారని, 2000లకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు.

అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, బాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కొంతం రాంరెడ్డి, బీసీ సెల్ కార్యదర్శి వేముల సత్తయ్యగౌడ్, పీసీసీ కార్యదర్శి మందాడి సురేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గ్యారలక్ష్మాయ్య, సర్పంచ్‌లు అబ్బసాని యాదగిరియాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
 
సభలో రసాభాస..
మండల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. మాజీ జెడ్పీటీసీ రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సభలో తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే పార్టీ కోసం పనిచేసేవారికి అవకాశం ఇస్తామని, పార్టీ బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి సభలో మాట్లడటానికి అవకాశం లేదని కేఎల్లార్ చెప్పారు. దీంతో సభలో గందళరగోళం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కల్పించుకొని వారిరువురికి సభ్యత్వం ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు