కన్నతల్లికి కూడుపెట్టని కొడుకులు

11 Apr, 2018 11:41 IST|Sakshi
సీఐకి మొర పెట్టుకుంటున్న వృద్ధురాలు

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కౌన్సెలింగ్‌ ఇచ్చి ఏకం చేసిన పోలీసులు

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు.. బుక్కెడు అన్నం పెట్టేందుకు నిరాకరించడంతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో చర్చనీయాంశమైంది. జమ్మికుంట సీఐ నారాయణ కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ముద్రకోల నర్సమ్మ, రాజయ్య దంపతులకు ఐదుగురు కుమారులు సంతానం. అందరికీ పెళ్లి అయ్యింది. రాజయ్య 15 ఏళ్లక్రితం చనిపోయారు. కుమారుల్లో ఇద్దరు మూడేళ్ల క్రితం చనిపోయారు. మిగిలిన ముగ్గురు కుమారులు వేర్వేరుగా ఉంటున్నారు. సంచార వృత్తి చేసుకుంటూ జీవిస్తుండడంతో నర్సమ్మను పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం నర్సమ్మ కుమారుల వద్ద వంతులవారీగా ఉంటోంది.

అయితే ఏ కొడుకు వద్ద ఉన్నా.. ఆ కొడుకు పింఛన్‌ డబ్బులు తీసుకునేవారు. ఇటీవల నర్సమ్మ అనారోగ్యం బారిన పడినా.. ఏ కొడుకూ స్పందించలేదు. చివరకు ఆరోగ్యశ్రీలోనే ఆమె ఆపరేషన్‌ చేయించుకుంది. ఈ క్రమంలో కొడుకులు పట్టించుకోవడం లేదని, తనకు అన్నం పెట్టడం లేదని పేర్కొంటూ ఆ తల్లి మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. స్పందించిన సీఐ ఆమె ముగ్గురు కుమారులకు సమాచారమిచ్చి.. స్టేషన్‌కు పిలిపించారు. వారిలో ఇద్దరు కుమారులు రాజయ్య, సంపత్‌ రావడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మను సరిగా చూసుకోవాలని, లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో కొడుకుల మనసు కరిగింది. తల్లిని వెంటబెట్టుకుని వెళ్లారు. బాగా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు