త్వరలో కొత్త కేంద్ర పారిశ్రామిక విధానం

6 Jul, 2018 00:31 IST|Sakshi

కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు

తోలు పరిశ్రమల అభివృద్ధికి రూ.2,600 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో కేంద్రం కొత్త పారిశ్రా మిక విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. తోలు పరిశ్రమ వంటి సంప్రదాయ రంగాల పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తు కలిగిన కొత్త రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడంపై కొత్త విధానం దృష్టి పెడుతుం దన్నారు.

గురువారం రాయదుర్గంలో ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. వస్తు ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించిన జిల్లాలను గుర్తించి ఈ కొత్త విధానం ద్వారా ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 100 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను అదనంగా విదేశీ మార్కెట్లకు పంపాలన్న లక్ష్యంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు.

దేశ తోలు పరిశ్రమల రంగాన్ని నవీకరించడం, పునరుద్ధరించడంలో భాగంగా ఎఫ్‌డీడీఐ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా తోలు పరిశ్రమ దేశంలో మనుగడ సాధించగలిగిందని, విదేశీ పరిశ్రమల నుంచి ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని సమర్థంగా అధిగమించాల్సి ఉందన్నారు.  

ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా..
తోలు పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం ఇప్పటికే రూ.2,600 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని సురేశ్‌ ప్రభు అన్నారు. ఆధునిక యంత్రాల కొనుగోళ్లు, శిక్షణ, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నామన్నారు. కొత్త భవనంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని, దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇదొకటి అని చెప్పారు.

తోలు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆకర్షణీయ డిజైన్లు కీలకమని, ఇక్కడి విద్యార్థులు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించే డిజైన్లకు రూపకల్పన చేసి తోలు వస్తువుల ఎగుమతుల పెంపునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రెటరీ అనిత, ఎఫ్‌డీడీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌సిన్హా, కార్యదర్శి వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు