హాస్టళ్లకు సన్నబియ్యం ధరపై త్వరలో నిర్ణయం

19 Dec, 2014 07:00 IST|Sakshi
  • కిలో రూ. 32కు పెంచాలని కోరుతున్న మిల్లర్లు
  • సాక్షి, హైదరాబాద్: జనవరి నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేయనున్న సన్నబియ్యం ధర విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల మధ్యాహ్న భోజన అవసరాల నిమిత్తం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ రకం బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది.

    లెవీ కింద సేకరిస్తున్న ఈ బియ్యానికి ప్రభుత్వం కిలో రూ.22.60 వంతున మిల్లర్లకు చెల్లిస్తుండగా కేంద్రం కిలోకు రూ.5.65 మాత్రమే భరిస్తోంది. దీంతో మిగతా భారం రాష్ట్రంపైనే పడుతోంది. కేంద్రం సబ్సిడీపై ఇస్తున్న బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4.65 సబ్సిడీని భరిస్త్తూ కేవలం రూ.1కే సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తోంది. అయితే, ప్రస్తుతం సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏ మేరకు అవసరాలు ఉంటాయి, ఎలాంటి ధర నిర్ణయించాలన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది.

    సాధారణ రకం (దొడ్డు రకం) ధాన్యం క్వింటాల్ ధర రూ.2,186.20 కాగా, గ్రేడ్-ఏ రకం ధాన్యం ధర రూ.2,244.46గా ఉంది. అలాగే దొడ్డు బియ్యం, సన్నం బియ్యం ధరల్లోనూ చాలా వ్యత్యాసం ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకొని తమకు ధరను నిర్ణయించాలని మిల్లర్లు ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
     

మరిన్ని వార్తలు