ఇక బాదుడే..

9 Nov, 2014 03:52 IST|Sakshi

ఆదిలాబాద్ క్రైం : నేటి యువతరం రయ్‌మని రోడ్లపైకి దూసుకెళ్లడం.. ప్రమాదాలకు గురికావడం పరిపాటి. ప్రస్తుతం కుర్రకారు స్పీడుకు బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్త చట్టం తెస్తోంది. వాహనం తీసి రోడ్లపైకి రావాలంటేనే భయపడేలా చట్టానికి పదును పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

ప్రభుత్వం ఈ చట్టం ద్వారా భారీగా జరిమానా విధించి కొరడా ఝులింపించాలని భావిస్తోంది. అంతా పెద్ద మొత్తంలో జరిమానా కట్టేదానికన్నా.. అన్ని పత్రాలు ఉంటేనే వాహనం రోడ్డుపైకి తీద్దాం అనే భయాన్ని నెలకొల్పనుంది. ఇప్పటి వరకు చిన్నపాటి జరిమానాలతో సరిపెట్టి.. స్పెషల్ డ్రైవ్‌ల పేరుతో హల్‌చల్ చేసినా.. వాహ నదారుల్లో పెద్ద మార్పులేవి రావడం లేదు.

ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లెసైన్సు లేకుండా యువకులు విచ్చలవిడిగా బైకులపై రయ్‌మంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కాలరాస్తూ.. ట్రాఫిక్ సిగ్నల్స్‌లను తెంచేస్తూ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదే ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టం తీసుకురానుంది.

 వేలల్లో జరిమానా..
 నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే ఇకపై భారీ జరిమానా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టానికి రూపకల్పన చేస్తోంది. దీని ప్రతిపాదనల ముసాయిదాను ( డ్రాప్ట్‌బిల్లు ) అభ్యంతరాల కోసం రాష్ట్రానికి పంపింది. దీని ప్రకారం డ్రైవింగ్ లెసైన్సు లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు, ద్విచక్రవాహనం నడిపే వారికి హెల్మెట్ లేకపోతే రూ.500, పత్రాలు లేకుండా నడిపితే రూ.500, ఇన్సురెన్స్ లేకుంటే రూ.10 వేల జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

నాలుగు చక్రాల వాహనాలను బెల్టు లేకుండా నడిపితే రూ.వెయ్యి, ఇన్సురెన్సు లేకపోతే రూ.10 వేలు, పత్రాలు లేకపోతే రూ.5 వేలు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేల చొప్పున జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మూడు సార్లు పట్టుబడితే వాహనాలు జప్తు లేదా.. లెసైన్సుల రద్దు చేస్తారు. ఇంతటి కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తే వాహనదారుల్లో భయం ఏర్పడి.. నిబంధనల ప్రకారం నడుచుకుంటారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
 
రోడ్డు ప్రమాదాల నివారణ
 రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో అమాయకులు బలవుతున్నారు. వాహన చట్టాలు కఠినంగా లేకపోవడం, వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెసైన్సు లేకుండా వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకుండా వేగంగా వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే వారిలో భయంలేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.

అదే విదేశాల్లో వాహన చట్టాలు కఠినంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ కఠినమైన చట్టాలతో అరెస్టులు చేయడం లాంటి చర్యలతో వాహనదారుల్లో భయం ఏర్పడి నిబంధనల మేరకు డ్రైవింగ్ జరుగుతుందనే భావన ఉంది. ఇప్పుడే మన దగ్గర కూడా అది అమలవుతే రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశాలు లేకపోలేదు.

మరిన్ని వార్తలు