త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ

24 Feb, 2015 03:56 IST|Sakshi
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ

మహబూబ్‌నగర్ క్రీడలు : జాతీయస్థాయిలో జరిగే క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించేలా సీఎం కేసీఆర్ త్వరలోనే క్రీడాపాలసీని ప్రవేశపెట్టనున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (షాట్) మేనేజింగ్ డెరైక్టర్ దినకర్‌బాబు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా స్టేడియంలో సోమవారం రాత్రి ఆయన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జాతీయ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని క్రీడాకారులు ఇక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుందని, టోర్నీలో క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో ఆసియా క్రీడలు నిర్వహించే సత్తా మనకు ఉందని అన్నారు. పాఠశాలలో మంచి క్రీడాకారుడిగా తీర్చిదిద్దే బాధ్యత పీఈటీలపై ఉందన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జాన్ మనోజ్ మాట్లాడుతూ ఎండీసీఏ ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. దినకర్‌బాబు తదితరులు ఆయా రాష్ట్రాల జట్లతో క్రీడావందనం స్వీకరించారు. అనంతరం క్రీడాపతాకాలను ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డిప్యూటీ డెరైక్టర్ నర్సయ్య, ఎస్‌జీఎఫ్ పరిశీలకుడు వికాస్,  హెచ్‌సీఐ ఉపాధ్యక్షుడు నరేందర్‌గౌడ్, ఒలింపిక్ సంఘం చైర్మన్ కేఎస్ రవికుమార్, ఇన్‌చార్జి డీఎస్‌డీఓ సోమశేఖర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ కోఆర్డినేటర్ విజయరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జలజం సత్యనారాయణ, వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి మాదవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సం సందర్భంగా జాతీయ జెండాలతో లిటిల్ స్కాలర్స్ విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్‌తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వెల్కిచర్ల విద్యార్థులు తెలంగాణ పాటకు చేసిన నృత్యం అందరినీ మంత్రముగ్దుల్ని చేశాయి. స్కౌట్స్ విద్యార్థులు దేశ రంగీలపాట, సమర్థ పాఠశాలల విద్యార్థులు నృత్యాలు కార్యక్రమానికి హైలెట్‌గా కనిపించాయి. పాటలకు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు, అఫీషియల్స్ డాన్స్ చేస్తూ కనిపించడం విశేషం..

మరిన్ని వార్తలు