త్వరలో జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ 211

29 Sep, 2014 23:26 IST|Sakshi
త్వరలో జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ 211
  • మారనున్న జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నెంబర్
  • ఆస్తిపన్నుకు భవనాల ‘3డి’ మ్యాపింగ్
  • సాక్షి,సిటీబ్యూరో: ప్రజా ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నెంబరు(21 11 11 11) ను మరింత సరళీకరించనున్నారు. దీన్ని మరిన్ని తక్కువ డిజిట్లతో త్వరలో ‘211’గా మార్చనున్నారు. ఈమేరకు సోమవారం ముఖ్యమంత్రి వద్ద జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది అమెరికాలోని న్యూయార్క్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 311గా ఉందని, నగరంలోనూ ప్రజలకు మరింత సులభంగా గుర్తుండేందుకు 211 నెంబరును అందుబాటులోకి
    తేవాలని నిర్ణయించారు.

    జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను లెక్కను మరింత పక్కాగా లెక్కించేందుకు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాత అదనంగా నిర్మించే అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు ‘3డి’ టెక్నాలజీతో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించారు. దీన్ని జీఐఎస్‌తో అనుసంధానిస్తారు. తద్వారా ఆస్తిపన్నును కచ్చితంగా నిర్ధారించడంతో పాటు.. అక్రమంగా వెలిసే నిర్మాణాల పైనా నిఘా ఉంటుందని భావిస్తున్నారు. సమావేశ వివరాలను పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విలేకరులకు వెల్లడించారు.

    వెస్ట్‌జోన్ పరిధిలో త్వరలో 4జీ, వైఫై సేవలు అందుబాటులోకి రానుండగా, గ్రేటర్ నగరమంతా డిసెంబర్ 4లోగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈమేరకు ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వోడాఫోన్‌కు అనుమతులిచ్చినట్టు తెలిపారు. సిటీలో బస్ పార్కింగ్‌కు, ప్రయాణానికి సంబంధించి బార్సిలోనా విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మెట్రో పోలిస్ సదస్సులో చర్చించనున్న ముఖ్యాంశాలకు సంబంధించీ సమావేశంలో ప్రస్తావించారు.
     
    శంకుస్థాపన.. ప్రారంభోత్సవం..

    దసరా పండుగ రోజున (అక్టోబర్ 3) ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు బేగంపేట- బల్కంపేట లింక్ రోడ్డుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేస్తారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈరోడ్డు అందుబాటులోకి వస్తే కూకట్‌పల్లి, బాలానగర్, ఫతేనగర్, బల్కంపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లేవారు, అమీర్‌పేట నుంచి కూకట్‌పల్లి, సనత్‌నగర్‌ల వైపు వెళ్లేవారి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయన్నారు. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు ఎన్నో సమస్యలను అధిగమించి ఇప్పటికి పూర్తయింది.
     

మరిన్ని వార్తలు