త్వరలో ‘తెలంగాణ భాషా బిల్లు’ 

17 Mar, 2018 03:15 IST|Sakshi

తమిళనాడు వెళ్లి అధ్యయనం చేసొచ్చిన బృందం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగించింది. ఇటీవల  జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకటి నుంచి 12 తరగతుల వరకు తెలుగు తప్పనిసరిగా ఉండాల్సిందేనని, అందుకు తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి నేతృత్వంలో బృందం ఇటీవల తమిళనాడు వెళ్లొచ్చింది.

అనంతరం బృంద సభ్యులు విద్యా భాషగా తమిళం ఎలా ఉందో.. తెలంగాణలో తెలుగు అంతకన్నా మెరుగ్గా ఉంచేందుకు ఒక నోట్‌ను తయారు చేసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్యకి ఇచ్చారు. ఆయన దాన్ని ముసాయిదా బిల్లు రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకొన్న తర్వాత దాన్ని కేబినెట్‌ ముందు ఉంచనున్నారు. కేబినెట్‌ దీన్ని ఆమోదించిన తర్వాత దీనికి ‘తెలంగాణ భాషా బిల్లు’గా నామకరణం చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కఠినతరమైన జీవో ఒకటి రానుంది. ఇది 1 నుంచి 12 వ తరగతుల వరకు నిర్వహించే పాఠశాలల ముంగిటకు చేరుతుంది.

మరిన్ని వార్తలు