శబ్ద, వాయు కాలుష్యాలతో మహిళల్లో గర్భస్రావం

11 Nov, 2019 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నానాటికి పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యాలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని తెలంగాణ హైకోర్టులో ఎమ్. ఆదిత్య అనే వ్యక్తి పిల్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై సోమవారం వాదనలు విన్న న్యాయస్థానం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ), మున్సిపల్ కమిషన్, తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డితో సహా రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.  

అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. దేశంలో ఢిల్లీ తరువాత హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, జంట నగరాల్లో పెరుగుతున్న వాహనాల కారణంగా శబ్ద, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందని  పిటిషనర్ తరపు న్యాయవాది రాపోలు భాస్కర్ వాదించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో మహిళలు గర్భస్రావంతో సహా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ హైకోర్టుకు విన్నవించారు. అలానే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌తో పాటు పలు ద్విచక్ర వాహనాల కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని పిటిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా
అదేవిధంగా సోమవారం మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబర్‌ 30న వాయిదా వేసింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జబ్బిర్ అహ్మద్ అనే వ్యక్తి  హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు