హారన్‌.. సైరన్‌

16 May, 2020 09:52 IST|Sakshi

నగరంలో రయ్‌..రయ్‌.. మళ్లీ పెరిగాయ్‌!

క్రమంగాపెరుగుతున్న వాహన వినియోగం

పలు కేంద్రాల్లో భారీగా నమోదైన శబ్ద కాలుష్యం

గత నెలతో పోలిస్తే అత్యధిక వాహనాల సంచారం  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో మళ్లీ వాహన విస్ఫోటనం సంభవిస్తోంది. మహానగరం పరిధిలో రోడ్డెక్కుతున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ మాసంలో మహానగర పరిధిలోని సుమారు 50 లక్షల వాహనాల్లో సింహభాగం ఇళ్లకే పరిమితం కాగా.. మే రెండోవారం నాటికి ఇందులో నాలుగింతల వాహనాలు ప్రస్తుతం రోడ్డెక్కుతున్నాయి. దీంతో నగరంలో శబ్ద కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాజధాని నగరంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుమారు 90 శాతం వాహనాలు ఇళ్లకే పరిమితం కాగా.. మే రెండో వారంలో సుమారు 60 శాతం వాహనాలు రోడ్డెక్కుతుండడంతో శబ్ద కాలుష్యం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా 90 డెసిబుల్స్‌ దాటిన శబ్దాలను అతి ధ్వనులుగా పరిగణిస్తారు. ఏప్రిల్‌ చివరి వారంలో నగరంలో 60 డెసిబుల్స్‌ మేర శబ్ద కాలుష్యం నమోదు కాగా.. మే రెండో వారం నాటికి శబ్ద కాలుష్యం 95–100 డెసిబుల్స్‌ నమోదవడం గమనార్హం.

ఏప్రిల్‌ మాసంలో ఇలా..
మార్చి మూడో వారంలో లాక్‌డౌన్‌ విధించడంతో మహానగరం పరిధిలో నిత్యం రోడ్డెక్కే 50 లక్షల వాహనాల్లో 90 శాతం ఇళ్లకే పరిమితమయ్యాయి. దీంతో నగరంలో శబ్ద కాలుష్యం 60 డెసిబుల్స్‌ లోపే నమోదైంది. ప్రధానంగా అత్యధిక వాహన సంచారం ఉండే అబిడ్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, ప్యారడైజ్, చాదర్‌ఘాట్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దీంతో సిటీజన్లు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతంసీన్‌ క్రమంగా మారింది. ఇప్పుడు క్రమంగా సిటీలో వాహన సంచారం పెరుగుతూనే ఉంది.

ఈ నెల రెండోవారంలో ఇలా..
ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తుండడంతో నగరంలో వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రధానంగా అత్యంత రద్దీగా ఉండే అబిడ్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లో వాహన సంచారం లాక్‌డౌన్‌ రోజుల కంటే నాలుగింతలు.. అంటే సుమారు 25 లక్షల వరకు ఉంది. దీంతో శబ్ద కాలుష్యం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అబిడ్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, గచ్చిబౌలి, తార్నాక తదితర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 95 డెసిబుల్స్‌ మేర నమోదవుతుండడంతో సిటీజన్ల గూబ గుయ్‌మంటోంది. అధిక శబ్ద కాలుష్యం కారణంగా నగరవాసులకు చిరాకు, అసహనం, గుండె దడ పెరగడం, నిద్రలేమి తదితర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెలాఖరులో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే నగరంలో శబ్ద కాలుష్యం మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు