సింగరేణి చైర్మన్‌తో దక్షిణాఫ్రికా ప్రతినిధుల భేటీ

24 Mar, 2015 01:10 IST|Sakshi

 గోదావరిఖని : సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌తో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మైనింగ్ యంత్రాల తయారీ కంపెనీ జాయ్ గ్లోబల్ ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా వారు భూగర్భ గనుల్లో అత్యధిక బొగ్గును తవ్వి తీసే అత్యాధునిక యంత్రాల గురించి, వాటి పనితీరు గురించి చైర్మన్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సింగరేణి సంస్థ రానున్న కాలంలో 80 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనున్న నేపథ్యంలో కొత్తగా తవ్వనున్న గనులకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని, యంత్రాలను తమ సంస్థ సమకూర్చగలదని జాయ్ గ్లోబల్ ప్రతినిధులు సీఎండీకి వివరించారు.

అనంతరం చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న గనులలో షార్ట్‌వాల్, కంటిన్యూయస్ మైనర్ వంటి యంత్రాలు ఏర్పాటు చేయడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది పరిశీలించాలని, కొత్తగూడెం వీకే-7లోని కంటిన్యూయస్ మైనర్ పనితీరును పరిశీలించి మరింత సమర్థవంతంగా అధిక ఉత్పత్తి సాధించడానికి గల అవకాశాలను వివరించాలని కోరారు. సమావేశంలో జాయ్ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులు ఆన్‌డ్రాయిన్, ఆ కంపెనీకి చెందిన భారతదేశ ప్రతినిధి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.  ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ ఎన్.శ్రీధర్ దక్షిణాఫ్రికాలోని గనులతోపాటు జాయ్ గ్లోబల్ కంపెనీని కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో త్వరలో సింగరేణిలో తవ్వనున్న కొత్త గనులలో ఏర్పాటు చేసే టెక్నాలజీని సదరు కంపెనీకి సంబంధించినవి వినియోగించేందుకు యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు