దక్షిణ మధ్య రైల్వే మరో ఘనత

25 Apr, 2019 02:07 IST|Sakshi

టికెట్ల రూపంలో గరిష్ట ఆదాయం పొందినదిగా గుర్తింపు

జాతీయ స్థాయిలో రెండో స్థానం

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే మరో ఘనతను సాధించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తరలింపు ద్వారా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించి భారతీయ రైల్వేలో రెండో స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆదాయం పెరుగుదల రేటులో కూడా రెండో స్థానంలో నిలిచింది. మార్చితో ముగిసిన 2018–19 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే 38.30 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి టికెట్లు, లగేజీ చార్జీల రూపంలో రూ. 4,059 కోట్లను ఆర్జించింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 8 శాతం ఎక్కువ కావడం విశేషం. 2017–18లో 37.90 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి రూ.3,749 కోట్లను ఆర్జించింది.

వసతులు పెంచాం..: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎప్పటికప్పుడు వారికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా పది రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. వీటిల్లో మూడు హమ్‌ సఫర్‌ రైళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. 18 రైళ్ల గమ్య స్థానాలను పొడిగించినట్లు, 3 రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచినట్లు, 21 రైళ్లకు అదనపు స్టాపులను సమకూర్చినట్లు వెల్లడించారు. ఏకంగా 2 వేల ప్రత్యేక రైళ్లను నడిపామని చెప్పారు. ఈ ఘనతను సాధించినందుకు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా అభినందించారు.

>
మరిన్ని వార్తలు