రైల్‌–బోట్‌.. ఇది రైల్వే రోబో

17 May, 2020 06:16 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో సొంత పరిజ్ఞానంతో రూపొందించిన రైల్వే అధికారి

రోగి వద్దకు వెళ్లకుండానే పరీక్షించే వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే ఆసుపత్రిలో రోబో ఆకట్టుకుంటోంది. సొంతంగా రైల్వే అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో రూపొందించిన ఈ రోబో, కోవిడ్‌ బాధితులకు వైద్య సేవలు చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది వారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా తగ్గించనుంది. దీనికి రైల్‌–బోట్‌ అనే పేరు పెట్టారు. అదనపు డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ (హైదరాబాద్‌) హేమ్‌సింగ్‌ బనోత్‌కు రోబోటిక్‌ శాస్త్రంలో అవగాహన ఉంది. దీంతో ఆయన తన సిబ్బంది సహకారంతో ఈ రోబోను రూపొందించారు.

రోగులకు మందులు, ఆహారం అందించటం, వారి శరీర ఉష్ణోగ్రత చూడటం, వారి వద్దకు వైద్య పరికరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లటం.. తదితరాల్లో దీని ఉపయోగం ఉండనుంది. పాన్‌ అండ్‌ టిల్ట్‌ ఫంక్షన్స్, రియల్‌ టైం వీడియో అనుసంధానం ఉండటంతో, వైద్యులు, రోగులు  దూరంగా ఉండే దీని ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు రికార్డు కూడా అవుతాయి. వారి శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్టు నమోదైతే అలారం మోగించి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఇది 80 కిలోల బరువును మోసుకెళ్తుంది.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్, రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్‌ కంట్రోలర్‌తో దీన్ని ఆపరేట్‌ చేస్తారు.  ప్రయోగాత్మకంగా లాలాగూడలోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆసుపత్రిలో దీనిని వినియోగిస్తున్నారు. రోబో పనితీరును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా పరిశీలించి, రూపొందించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు