‘వారి కృషి అభినందనీయం’

23 Apr, 2020 17:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడిలో భాగంగా భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా 5000 నాన్‌ ఏసి కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాలనే ఆలోచనలో భారతీయ రైల్యే ఉంది. ఇందులో భాగంగా 486 కోచ్‌లను తయారు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది.  తదనుగుణంగా, సికింద్రాబాద్‌ డివిజన్‌ 120 కోచ్‌లు, హైదరాబాద్‌ డివిజన్‌ 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్‌ 50 కోచ్‌లు, గుంతకల్లు డివిజన్‌ 61 కోచ్‌లు, నాందేడ్‌ డివిజన్‌ 30 కోచ్‌లు, గుంటూరు డివిజన్‌ 25 కోచ్‌లు, లాలాగూడ వర్క్‌షాప్‌ 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్‌ 84 కోచ్‌లను ఐసోలేషన్‌ కోచ్‌లుగా మార్చాయి. ఇందుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. (బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!)

ప్రతి ఐసోలేషన్‌ వార్డులో కరోనా బాధితుల కోసం 8 కూపేలు, వైద్య సిబ్బంది కోసం ఒక కూపే ఉంటాయని నోట్‌లో తెలిపారు. రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కోచ్‌లలో స్నానాల గది, 3 టాయిలెట్లు, కూపేల మధ్య తెరలు, అవసరమైన ఎలక్ట్రిక్‌, వైద్య పరికరాలు అమర్చడం జరిగిందని ఆ నోట్‌లో దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిర్దేశించిన లక్ష్యంలోగా ఐసోలేషన​ కోచ్‌లను తయారు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులను, సిబ్బందిని జనరల్‌ మేనేజర్‌ శ్రీగజానన్‌ మాల్యా అభినందించారు.  (రైల్వే బుకింగ్లు షురూ!)

మరిన్ని వార్తలు