లీజు చుక్‌..చుక్‌..

4 Nov, 2019 11:46 IST|Sakshi

ప్రైవేట్‌ సంస్థలకు రైల్వే స్థలాలు

లీజుకిచ్చేందుకు రంగం సిద్ధం

పలు ప్రాంతాల్లో రూ.వందల కోట్ల విలువైన భూములు

కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు,రెసిడెన్షియల్‌ భవనాలనిర్మాణం  

మెట్టుగూడలోని 2.36 ఎకరాల లీజుకు నోటిఫికేషన్‌  

త్వరలో మౌలాలి, లక్డీకాపూల్‌ స్థలాలపై ప్రకటన  

రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాచరణ

సాక్షి,సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వేకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ప్రైవేట్‌ పరం కానున్నాయి. ఇప్పటికే ఈ జోన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్లు, ప్రధాన మార్గాల్లో నడిచే రైళ్ల ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎంఎంటీఎస్‌ రైళ్లతో పాటు, సికింద్రబాద్‌–విజయవాడ వంటి ప్రధాన మార్గాల్లో నడిచే పలు సర్వీసులను సైతం ప్రైవేట్‌ సంస్థల ద్వారా నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. అలాగే సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలను పూర్తిగా ప్రైవేటీకరించారు. తాజాగా రైల్వే స్థలాల లీజు బేరం తెరపైకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న స్థలాలను గుర్తించి లీజు ద్వారా ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) కార్యాచరణను రూపొందించింది. ఈ స్థలాలను ప్రైవేట్‌ వ్యాపార సంస్థలకు కట్టబెట్టి అక్కడ షాపింగ్‌ మాల్స్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్లు, హోటళ్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లతో పాటు రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్ల నిర్మాణ సంస్థలకు లీజు పద్ధతిలో అప్పగించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న  భూములు, మార్కెట్‌ విలువ, అక్కడ ఏ రకమైన నిర్మాణాలు చేపడితే ప్రైవేట్‌ సంస్థలకు ఆదాయం సమకూరుతుంది.. అదే సమయంలో ఆయా భూముల లీజు ద్వారా రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందనే అంశాలపైన ఆర్‌ఎల్‌డీఏ అధ్యయనం చేపట్టింది. ఈ భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా రైల్వేకు రూ.వందల కోట్ల ఆదాయం లభించగలదని  ఆర్‌ఎల్‌డీఏ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మెట్టుగూడ మెట్రో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న 2.36 ఎకరాల రైల్వే మిలీనియం పార్కు స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్‌ సైతం విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ప్రైవేట్‌ వ్యాపార సంస్థలతో ప్రీబిడ్‌ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆసక్తిగల సంస్థల నుంచి డిసెంబర్‌ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎల్‌డీఏ తెలిపింది. 

ఇతర భూములు కూడా..
మెట్టుగూడ తరహాలోనే మరిన్ని విలువైన భూములను సైతం లీజుకు ఇచ్చేందుకు ఆర్‌ఎల్‌డీఏ ప్రణాళికలను రూపొందించింది. మౌలాలీ ఫ్లైఓవర్‌కు ఆనుకొని ఉన్న 22 ఎకరాల భూమిలో అపార్ట్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు డెవలపర్స్‌కు లీజుకు ఇవ్వనున్నారు. కమర్షియల్‌గా అభివృద్ధి చేసేందుకు అవకాశం లేని ఈ  భూమిని నివాస ప్రాంతాలుగా మార్చడం ద్వారా ఆదాయం లభిస్తుందని అధికారులు యోచిస్తున్నారు. ఇక్కడ భూమి విలువ  రూ.కోట్లలో ఉంటుంది. మార్కెట్‌ ధర ప్రకారం 22 ఎకరాల ధర సుమారు రూ.100 కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. అంతటి విలువైన భూముల నుంచి ఆర్‌ఎల్‌డీఏ ఎంత వరకు ఆదాయాన్ని రాబట్టుకోగలదనేది ప్రశ్నార్థకమే. మరోవైపు లక్డీకాపూల్‌ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌కు ఆనుకొని ఉన్న మరో రెండెకరాల స్థలాన్ని కూడా లీజు పద్ధతిలో కట్టబెట్టేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధంచేశారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాల భూములపైనా ఆర్‌ఎల్‌డీఏ కసరత్తు చేస్తోంది. 

మెట్టుగూడ పైనే ఆశలు
ఈ మూడు ప్రాంతాల్లోని స్థలాల్లోనూ మెట్టుగూడ రైల్‌ కళాభవన్‌కు ఎదురుగా, మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న 2.36 ఎకరాల భూమి లీజుపైనే ప్రస్తుతం ఆర్‌ఎల్‌డీఏ ఆశలు పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే ప్రీబిడ్‌ సమావేశం కూడా నిర్వహించారు. సికింద్రాబాద్‌ నుంచి నాగోల్‌  మెట్రో రైల్‌ మార్గంలో ఉన్న మెట్టుగూడ నగరానికి తూర్పు వైపు  అతిపెద్ద కమర్షియల్‌ హబ్‌గా అభివృద్ధి చెందగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్డీకాపూల్‌ కంటే ఇక్కడ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌ నిర్మించి నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇవే  అంశాలను ప్రీబిడ్‌ సమావేశంలోనూ ఆర్‌ఎల్‌డీఏ అధికారులు నిర్మాణ సంస్థలకు వివరించారు. ఇక మౌలాలీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కమర్షియల్‌ కార్యకలాపాలకు అవకాశం లేనందువల్ల అక్కడ కేవలం  నివాస భవనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ‘ఆర్‌ఎల్‌డీఏ కొన్నింటిని 99 ఏళ్లకు లీజుకిస్తే మరికొన్నింటిని 49 ఏళ్లకు ఇస్తుంది. నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లోని స్థలాల ద్వారా రూ.350 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. లీజు పద్ధతిలో ప్రైవేట్‌ నిర్మాణ సంస్థలకు ఇవ్వడం అనే ప్రయోగం ఉత్తరాదిలో విజయవంతమైంది. అదే తరహాలో ఇక్కడా భూములను లీజుకు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టారు’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

మరిన్ని వార్తలు