రాష్ట్రంలో కొరియన్‌ పరిశ్రమల క్లస్టర్‌

26 Sep, 2019 02:21 IST|Sakshi
కొరియన్‌ రాయబారికి జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి కేటీఆర్, సీఎస్‌ జోషి

ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం: మంత్రి కేటీఆర్‌

దక్షిణ కొరియా బృందంతో భేటీ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొరియన్‌ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కొరియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (కీటా), కొరియా ట్రేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ (కొట్రా)తో కలసి ఈ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారి కార్యాలయం ఏటా మూడు రాష్ట్రాల్లో ‘కొరియా కారవాన్‌’పేరుతో సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా 48 మందితో కూడిన కొరియన్‌ బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. మంగళవారం కేటీఆర్‌తో ఈ బృందం సమావేశమైంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి ఆయన వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమైందని తెలిపారు. ఇప్పటికే పలు దేశాల నుంచి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని, ముఖ్యంగా ఐటీ రంగంలో టాప్‌ 5 కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఐటీతో పాటు 14 ఇతర రంగాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య రంగాలుగా గుర్తించి సత్వర అనుమతులు, రాయితీలు అందిస్తోందని చెప్పారు. కొరియా పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కొరియన్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. పెట్టుబడులు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని కొరియా ప్రతినిధి బృందాన్ని కోరారు. 

సానుకూలంగా ఉన్నాం
వ్యాపార, వాణిజ్య అవకాశాలతో పాటు, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి కొరియన్‌ బృందం కృషి చేస్తుందని ఆ దేశ రాయబారి షిన్‌ బొంగ్‌ కిల్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజెంటేషన్‌ చూశాక ఇక్కడి ప్రభుత్వానికి పరిశ్రమలు, పెట్టుబడులపై ఉన్న ఆసక్తి, విజన్‌ అర్థమవుతోందని పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఐటీ, ఏరోస్పేస్‌ రంగాలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం వ్యాపారాభివృద్ధి, పెట్టుబడులతో ఆకర్షణీయంగా ఉందన్నారు. భారతదేశం ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడున్న వ్యాపార అవకాశాలను వినియోగించుకుంటామని చెప్పారు. అనేక కొరియా కంపెనీలు దేశానికి పెట్టుబడులతో తరలి వస్తున్నాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు