రుతుపవనాలు మరింత ఆలస్యం

14 Jun, 2019 01:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

18న రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలోకి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత ఈనెల 8న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించారు. అనంతరం 11న అని ఓసారి, 13న అని మరోసారి, చివరకు 16న వస్తాయని ఇంకోసారి పేర్కొన్నారు. తాజాగా అవి 18న వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా సముద్రంలో తుఫాన్‌ ఏర్పడటంతో రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోయాయని అధికారులు చెబుతున్నారు. తుఫాను వెళ్లిపోయినా, వాతావరణంలో ఇంకా అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. 

తగ్గని వడగాడ్పులు... 
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏప్రిల్‌లో మొదలైన వడగాడ్పులు జూన్‌ రెండో వారంలోకి వచ్చినా తగ్గడంలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వేసవిలో ఇప్పటివరకు 36 వడగాల్పుల రోజులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఇంతటి పరిస్థితి లేనే లేదు. మరో నాలుగు వడగాల్పుల రోజులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.   

>
మరిన్ని వార్తలు