ఆశలు ఆవిరి

21 Aug, 2014 03:01 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: నైరుతి రుతు పవన కాలం ముగుస్తోంది.. వరుణుడు ఈ ఖరీఫ్‌లో ముఖం చాటేశాడు. సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది.. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో సాగు చేసిన పంటలూ వడబడుతున్నాయి.. దీంతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే నాలుగు మండలాల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు నాగార్జునసాగర్ ఆయకట్టు రెండోజోన్ పరిధిలో ఉన్న జిల్లాకు నీరు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు బీడు భూమిగా మారే పరిస్థితి నెలకొంది.

 వర్షాభావంతో జిల్లా వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతు పవనాలతో ఈ ఖరీఫ్‌లో తగినంత వర్షం పడకపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షంతో సాగు చేసిన పత్తి, మిర్చి ఇతర పంటలు కూడా ఎండిపోతున్నాయి. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండడంతో పంటలు ఇక చేతికి రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ఇందులో నీటి ఆధారం, వర్షాధారంగా వేసే పత్తి 4.6 లక్షలు, సాగర్ ఆయకట్టు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగయ్యే వరి 3.31 లక్షల ఎకరాలుగా ఉంది. ఇతర పంటలు 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగు కావాలి. కానీ ఈ ఖరీఫ్‌లో పత్తి 3.93 లక్షల ఎకరాల్లో, చెరువులు, బోరుబావుల కింద వరి 77 వేల ఎకరాలు, మిర్చి 3,232 ఎకరాల్లో సాగు చేశారు. అయితే వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా వర్షాధార పంట అయిన పత్తి రోజురోజుకూ వడబడుతోంది.

గత వారం రోజులుగా 32 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే  పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతు పవనాల విజృంభణ ఈ ఖరీఫ్‌లో ఆశించినంతగా లేకపోవడం, ఇక పవనాలతో వర్షం పడే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో జిల్లాలో కరువు కోరలు జాసింది.

 జిల్లాలో తీవ్ర వర్షాభావం..
 జిల్లాలో నైరుతి రుతు పవనాల ఆగమనం జూన్ నుంచి మొదలు కావాలి. అయితే ఈ మూడు నెలల్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. గత నెలలో కొంత వర్షం పడడంతో రైతులు పత్తి, మిర్చి, బోరుబావుల కింద వరి సాగు చేశారు. ఈ నెలలో వర్షాలు పడతాయని ఆశిస్తే.. అడియాశలే అయ్యాయి. జూన్ సాధారణ వర్షపాతంలో 77 శాతం, జూలైలో 23 శాతం, ఈనెలలో ఇప్పటి వరకు 62.6 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది.

జిల్లాలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, బోనకల్, చింతకాని మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మండలాలను తీవ్ర వర్షాభావ మండలాలుగా గుర్తించింది. ఈనెల చివరి నాటికి సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ఈ మండలాల సంఖ్య ఇంకా పెరగవచ్చు. వచ్చే నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంటే పశువులు తాగడానికి కూడా చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

 ఆయకట్టుకు నీరందేనా..?
 నాగార్జున సాగర్ గరిష్ట నీటినిలువ సామర్థ్యం 590 అడుగులు. నైరుతి రుతు పవనాలతో వర్షం లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ప్రస్తుతం సాగర్‌లో 537 అడుగుల నీరు మాత్రమే ఉంది. సాగర్ ఎడమ కాలువ పరిధిలో జిల్లాలోని 16 మండలాల్లో 2.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

ఇందులో మొదటి జోన్‌లో 14 వేలు, రెండో జోన్‌లో 2.37 ఎకరాల ఆయకట్టు ఉంది. మొదటి జోన్‌కు నీటి విడుదల చేయడంతో జిల్లాలోని కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలకు మాత్రమే సాగు నీరు అందుతోంది. ఇక రెండో జోన్‌కు నీరు ఎప్పుడందుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పదిరోజులు, వచ్చే నెలలో భారీగా వర్షాలు పడితేనే ఎగువ నుంచి వచ్చే వరదతో సాగర్ నిండే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు