రావమ్మా.. నైరుతీ..

15 Jun, 2019 08:33 IST|Sakshi

ఎనిమిదేళ్లలో రుతుపవనాల ఆలస్యం ఐదోసారి

ఇంకా మిగిలింది..నాలుగు రోజులే..

సకాలంలో వర్షాలు కురవకుంటే ఇబ్బందులే

సాక్షి, సిటీబ్యూరో: నైరుతి రుతపవనం..మళ్లీ మారాం చేస్తోంది. ఇప్పటికే తెలుగు నేలను తాకాల్సిన రుతురాగం కేరళ సరిహద్దుల్లోనే తచ్చాడుతోంది. ఫలితంగా తెలంగాణ అంతటా మరో వారం రోజులు వేడిగాలుల తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అడుగంటిన భూగర్భ జలాల తీవ్రతతో పట్టణ ప్రాంతాల్లో మంచినీటి అవస్థలు తీవ్రం అవుతుంటే.. ఖరీఫ్‌ సాగును నమ్ముకున్న రైతాంగం బిక్కమొహంతో ఎదురుచూపులు చూస్తోంది. నైరుతి రుతపవనాల రాకను గమనిస్తే గడిచిన ఎనిమిదేళ్లలో ఆలస్యంగా రావటం ఇది ఐదోసారి కావటం గమనార్హం. 2014లో జూన్‌ 19న 2016లో జూన్‌ 18న, 2012లో జూన్‌ 16న తెలంగాణ జిల్లాలకు రుతుపవనాలు ఆలస్యంగా చేరాయి. మిగిలిన అన్ని సంవత్సరాల్లో జూన్‌ 13 లోపే పలకరించి తెలంగాణ జిల్లాలన్నింటికి విస్తరించినా ఈయేడు సైతం జూన్‌ 19 తర్వాతే నైరుతి రుతుపవనాలు ప్రవేశించి...వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

20 తర్వాతే.. కరువు తీరేది
ఈశాన్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న తూర్బు మధ్య బంగాళాఖాతంలో 3.6 కి.మీ ఎత్తు వరకు గల ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారిన మూలంగా వచ్చే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణలో నమోదు అవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐతే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో వారం రోజులు వడగాలల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. 18వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షపాతం నమోదైయ్యే అవకాశాలున్నా, 20వ తేదీ తర్వాత కరువు తీరా వర్షం కురుస్తుందన్న సమాచారం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ వీకే రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ పలు కారణాలతో రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని, 18వ తేదీ తర్వాత రుతుపవనాలు ప్రవేశించి 20వ తేదీ తర్వాత నిల కడగా వర్షించే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు