పది రోజుల్లో నైరుతి పలకరింత

29 May, 2018 01:02 IST|Sakshi

జూన్‌ 7 లేదా 8న రాష్ట్రాన్ని తాకనున్న రుతుపవనాలు

నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా

సాక్షి, హైదరాబాద్‌: వారం పది రోజుల్లో రాష్ట్రాన్ని నైరుతి పలకరించనుంది. జూన్‌ 7 లేదా 8వ తేదీల్లో రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం రాత్రికి కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలిపింది. అటునుంచి తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర మీదుగా రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్, శ్రీలంక ప్రాంతాలను తాకినట్లు వెల్లడించారు. సోమవారం అండమాన్‌ నికోబార్‌ దీవులకు నైరుతి పూర్తిగా విస్తరించినట్లు వెల్లడించారు. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వివరించారు. కేరళతోపాటు మంగళవారం దక్షిణ అరేబియా సముద్రం, లక్ష దీవుల్లోని కొన్ని ప్రాంతాలకూ రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపారు.

జూన్‌–సెప్టెంబర్‌లో సాధారణమే!
ఈ ఏడాది జూన్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో అస్థిర పరిస్థితులేవీ లేనందున వర్షపాతానికి ఢోకా ఉండదని తెలిపింది. తెలంగాణలో ఈ ఏడాది సుమారు 755 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రకటించింది.

పొంచి ఉన్న క్యుములోనింబస్‌
రుతుపవనాల రాకకు మరో పది రోజుల సమయం ఉండటంతో ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో క్యుములోనింబస్‌ కుమ్మేసే అవకాశాలున్నట్లు హెచ్చరించింది.


జూన్‌ 1 వరకు ఎండలు...
జూన్‌ ఒకటి వరకు రాష్ట్రంలో ఎండలు దంచికొట్టే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం సుమారు 40 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇదే తరహాలో మరో నాలుగు రోజులు ఎండల తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉంటుందని హెచ్చరించింది.

మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లినవారు వడదెబ్బకు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జూన్‌ 2 నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర తగ్గుముఖం పడతాయని.. నైరుతి రుతుపవనాల పలకరింపుతో క్రమంగా వాతావరణం చల్లబడుతుందని తెలిపింది.

మరిన్ని వార్తలు