‘నై’రుతి!

11 Jun, 2015 00:15 IST|Sakshi

 ఏరువాక వెళ్లిపోయింది.. మృగశిర కార్తె వచ్చేసింది..
 కానీ నైరుతీ రుతు పవనాల జాడ లేదు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతోందని, దీని ప్రభావంతో జిల్లాలో కనీసం మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట డివిజన్లతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు కురవడంతో అక్కడక్కడా రైతాంగం విత్తనాలు విత్తుతోంది. అయితే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో భారీ వర్షం కురిసేంత వరకు ఓపిక పట్టాలని, విత్తనం మొలకెత్తేందుకు అవసరమైనంత పదును భూమిలో లేదని, సూర్యతాపానికి విత్తనం ఎండిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ జేడీ హుక్యానాయక్ హెచ్చరించారు.
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వర్షాల ఆగమనం ఆలస్యమైనా.. రైతులు మాత్రం సాగు పనుల్లో మునిగిపోయారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 5.47 హెక్టార్లలో సాగు చేస్తారని, ఇందుకోసం 13,750 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, 2.19 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు రైతులు సాంప్రదాయక విత్తనాలు కూడా సిద్ధం చేశారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రాంతంలో అల్లం, సోయాబీన్, ఉల్లిగడ్డ, గజ్వేల్ నియోజకవర్గంలో కూరగాయలు, సోయాబీన్ పంటలు విస్తారంగా వేస్తారు.
 
 మిగిలిన ప్రాంంతాల్లో సాధారణంగా వరి, పెసర, కంది, పత్తి, పొద్దు తిరుగుడు పంటలు వేస్తారు. మృగశిర కార్తె వచ్చిన నాటి నుంచి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒక్క మనూరు మండలంలో మినహాయించి దాదాపు అన్ని మండలాల్లో ఎంతో కొంత వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో  సాధారణ వర్షపాతంకంటే  93.5 మి.మీ. వర్షపాతం ఎక్కువగా నమోదు అయింది. 433.3 మిమీ సాధరాణ వర్షపాతం ఉండగా 526.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. జిల్లా వ్యాప్తంగా మరో ఐదారు మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం కంటే  కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో భూమిలో పదును నిలబడలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
 
 ఎర్ర నెలల్లో  కనీసం 65 మి.మీ, నల్లరేగడి భూముల్లో 75 మి.మీ వర్షపాతం రెండోసారి నమోదు అయినప్పుడు విత్తనం వేయాలని వారు సూచిస్తున్నారు. తొలకరి వానలతో భూమిలో ఉన్న వేడి బయటికి వెళ్లి మట్టి చల్లబడుతుందని, ఇలా చల్లబడిన మట్టి రెండవ సారి తడిస్తే అప్పుడు మాత్రమే విత్తనం మొలకెత్తటానికి అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రెండో సారి వర్షాలు కరిసినప్పుడు భూమిలో పదును దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం జూన్ 15 నుంచి జూలై15 వరకు రైతులు అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చని జేడీ హుక్యానాయక్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు