సోయా.. గయా

20 Oct, 2014 03:11 IST|Sakshi
సోయా.. గయా

జిల్లా రైతులకు గతేడాది సిరులు కురిపించిన సోయా పంట ఈసారి కన్నీళ్లు మిగిల్చింది. దిగుబడి గణనీయంగా తగ్గడంతో జిల్లా వ్యాప్తం గా రూ.75కోట్లుకు పైగా నష్టం వాటిల్లనుంది.  
 -జగిత్యాల అగ్రికల్చర్

 వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆదుకుంటుందనుకున్న సోయా పంట రైతులను నట్టేట ముంచింది. గతేడాది జిల్లా రైతాంగానికి సిరులు కురిపించిన పంట ఈ ఏడాది కన్నీళ్లు మిగిల్చింది. వాతావరణ లోపమో లేదా విత్తనాల నాణ్యతా లోపమో తెలియదు గానీ పంట మొత్తం కుళ్లిపోతోంది. విత్తనాల కోసం ఎగబడిన రైతులు ఇప్పుడు పంట చూసి దిగులు చెందుతున్నారు.

 
 జగిత్యాల అగ్రికల్చర్/మల్లాపూర్ :
 జిల్లాలో 50 వేల ఎకరాల్లో సోయా సాగైంది. గతేడాది పరిస్థితుల నేపథ్యంలో విత్తనాలు దొరుకుతాయో లేదోనని సీజన్ మొదట్లోనే రైతులు వ్యవసాయాధికారుల కార్యాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. ఒక్కో బస్తా(30) కిలోలను సబ్సిడీ పోను రూ.1600 వరకు కొనుగోలు చేశారు. ఎకరాకు ఒక బస్తా చొప్పున 50 వేల ఎకరాల్లో 50 వేల బస్తాల విత్తనాలు వేశారు.

సీజన్ మొదట్లో మురిపించిన వర్షాలు ఆనక ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో అడపాదడపా కురిసిన చిరుజల్లులకు మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి హడావుడిగా విత్తనాలు తెప్పించి రైతులకు పంపిణీ చేయగా... రెండోసారి విత్తనాలు వేశారు. ఇలా విత్తనాలపైనే రైతులు రూ.8 కోట్లు ఖర్చు చేయగా ప్రభుత్వం రూ.8 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది.

 నష్టం రూ.75 కోట్లు
 సోయాబీన్ కనీస దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్లు. ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించకున్నా కనీసం 5 క్వింటాళ్లు రావాలి. కానీ, వర్షాభావ పరిస్థితులకు తోడు విత్తనాల నాణ్యతా లోపంతో ఎకరాకు క్వింటాల్ నుంచి రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఒక్కో రైతు దిగుబడి రూపేణా ఎకరాకు 5 క్వింటాళ్లు నష్టపోయారు. జిల్లాలో 50 వేల ఎకరాలు సాగు కాగా... 2.50 లక్షల క్వింటాళ్ల పంట నష్టపోయినట్లే.

విత్తనాలు, ఎరువులు, కలుపుతో కలిసి ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి అయింది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2600 ఉండగా ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఈ పంట సాగుతో రైతులకు మూడు నెలల శ్రమతోపాటు ఎకరాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు నష్టం వాటిల్లనుంది. ఈ లెక్కన పెట్టుబడి రూపేణా కనీసం రూ.30 కోట్లు నష్టపోగా... దిగుబడి నష్టాన్ని కలుపుకుంటే ఈ నష్టం రూ.75 కోట్ల పైమాటే.

 కారణాలేంటి?
 వర్షాభావ పరిస్థితులతోనే దిగుబడి తగ్గిందని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు ఓ వైపు చెబుతుండగా... నాణ్యత లేని విత్తనాల వల్లే పంట సరిగారావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. విత్తనాలకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడడంతో ఆఘమేఘాల మీద మధ్యప్రదేశ్ తది తర ప్రాంతాల నుంచి తెప్పించడంతో ఆ విత్తనాల్లో పురుగుపట్టిన, బూజుపట్టిన విత్తనాలు కూడా వచ్చాయి.
విత్తనశుద్ధి చేసినట్లు ఆనవాళ్లు కూడా కనిపించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పంటకు చీడపీడలు ఎక్కువగా ఆశించి, పంట నష్టం చేశాయి. కొన్ని చోట్ల అసలు పూతే రాలేదు. వచ్చిన పూత సైతం మాడిపోయింది. మొక్కలు ఎండిపోయాయి. మంచిగా ఉన్న మొక్కలకు సైతం ఒకటి రెండు కాయలకు మించి లేవు.

 దున్నేస్తున్న రైతులు
 సోయా దిగుబడిపై ఆశలు వదులుకున్న రైతు లు కనీసం రెండో పంటగా మొక్కజొన్న వేసేం దుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న పంటలో ఎకరాకు ఒకటి నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమున్నప్పటికీ వాటిని కోయడం, నూర్పడం ఖర్చుతో కూడుకున్నందున... పంట నే దున్నేస్తున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా వ్యవసాయాధికారులు గానీ, శాస్త్రవేత్తలు గానీ దృష్టి పెట్టడం లేదు.

పలువురు రైతులు సమాచారమందించినా... నామమాత్రంగా పంటను చూసి సూచనలందించకుండానే వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తే రైతులకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విత్తనాల వల్ల నష్టం జరిగినట్లు భావిస్తే విత్తన ఉత్పత్తి సంస్థల నుంచి ప్రభుత్వం నష్టపరిహారం కోరే అవకాశం ఉంటుంది.

రైతులందరూ సోయాబీన్‌ను దున్నేసిన తర్వాత అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే జగిత్యాల ప్రాంతంలో సోయాబీన్ పంటను దున్నేస్తున్నందున జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రజాప్రతినిధులు సైతం అధికారయంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు అండగా నిలవాల్సిన అవసరముంది.
 
 
 
 
 ఖర్చు ఇలా...
 భూమి దున్నడం    : 2000
 విత్తనాలు               : 2400
 ఎరువులు              : 1000
 కలుపు, గడ్డిమందు : 2000
 యూరియా            : 300
 మందుల పిచికారీ   : 1500
 పంటకోతకు            : 2500

మరిన్ని వార్తలు