మోదీ టీమ్‌లో సోయం ఉండాలి

6 Apr, 2019 12:02 IST|Sakshi
రోడ్డు షోకు తరలివచ్చిన జనం 

సాక్షి, ఆదిలాబాద్‌ రూరల్‌: అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఆదివాసీ ప్రజలతోపాటు ఇతరుల సమస్యలపై ప్రభుత్వాలతో నిరంతరం పోరాటాలు చేస్తున్న బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి సోయం బాపురావును భారీ మెజార్టీతో గెలిపించి కేంద్రంలోని మోదీ టీమ్‌లో చేర్పించాలని బీజేపీ ఫ్లోర్‌ లీడర్, ఎమ్మెల్యే రాజాసింగ్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. వందలాది ద్విచక్ర వాహనాలతో రోడ్‌ షో చేపట్టగా, పట్టణం బీజేపీ జెండాలతో కాషాయమయమైంది. రోడ్‌ షోలో రాజాసింగ్‌పై కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. షో పొడవునా అందరికీ అభివాదం చేస్తూ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

అనంతరం పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల ఎంపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి తమ పార్టీ అభ్యర్థి సోయం బాపురావుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. సోయం బాపురావు గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో మోదీ టీమ్‌లో కొనసాగే అవకాశం ఉందన్నారు. సోయం బాపురావు గెలిస్తే 24 గంటలు అందుబాటులో ఉండి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తమదేనన్నారు. యువకుల ఉత్సాహం, ప్రజాధరణ చూస్తే 200 శాతం సోయం బాపురావు గెలుపు ఖాయమనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్దాల కోరని  మండిపడ్డారు.

రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ రూ.లక్షా 30 కోట్లు పంపించినా, తమకు ఏమీ ఇవ్వలేదని పేర్కొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉగ్రవాదాన్ని తరిమికొట్టిందన్నారు. అనంతరం పార్టీకి మద్దతు తెలిపేవారు సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ ఆన్‌ చేయాలని తెలపగా అందరూ తమ ఫ్లాష్‌ ఆన్‌ చేసి తమ మద్దతును ప్రకటించారు. అంతకు ముందు బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపూరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజల నుంచి తమకు లభిస్తున్న ఆదరణతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లో వణుకు మొదలైందన్నారు. ఏ పల్లెకు.. పట్టణానికి వెళ్లినా ఈ సారి ఆదిలాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం గెలుపు ఖాయమమంటున్నారన్నారు. తన గెలుపు కోసం కార్యకర్తలు, అభిమానులు సైనికుల్లా పని చేయాలని కోరారు. వారి శ్రమ ఎప్పటికీ వృథా కాదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, లోక్‌సభ ఇన్‌చార్జి ఆదినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి వేణుగోపాల్, నాయకులు సంతోష్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు