సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం

23 May, 2019 02:57 IST|Sakshi

ఇతర రాష్ట్రాల్లో కొని తెలంగాణలో ఉత్పత్తి చేసినట్లుగా ట్యాగ్‌లు

వేలాది మంది రైతులకు తెలియకుండానే వారి పేర్లను వాడుకుంటున్న వైనం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నదంటూ విత్తన ధ్రువీకరణ సంస్థపై విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో కంపెనీలు, కొందరు అధికారులు నిమగ్నమయ్యారు. నాణ్యమైన విత్తనం అందించాలని ప్రభు త్వం పదేపదే చెబుతున్నా దళారులు, కొందరు అధికారులు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో సోయా విత్తనాన్ని పండించి, ఉత్పత్తి చేసి ఇవ్వాలని సర్కారు కోరితే, అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలోనే ఉత్పత్తి చేసినట్లు ట్యాగ్‌లు వేయించుకోవడం ఇప్పుడు తీవ్ర ఆరోపణలకు దారితీసింది. కంపెనీలకు కొందరు అధికారులు వంత పాడడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విత్తన ధ్రువీకరణ సంస్థలోని కొందరు అధికారుల అండ చూసుకునే అనేక కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్‌ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ జరు గుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నందున, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నందునే ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు.  

విత్తన ఉత్పత్తికి శ్రీకారం చుట్టినా..
రాష్ట్రంలో ఖరీఫ్‌లో సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 5.80 లక్షల ఎకరాలు. ఈ పంట ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో సాగవుతోంది. అయితే సోయాబీన్‌కు అవసరమైన విత్తనాలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. రెండు మూడేళ్ల క్రితం వరకు టెండర్లు పిలిచి కంపెనీలకు విత్తనాల సేకరణ బాధ్యత అప్పగించేవారు. ఆయా కంపెనీలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి విత్తనాలను కొని ఇక్కడ విక్రయిస్తుంటాయి. రాష్ట్రం విత్తన భాండాగారంగా ఉన్నందున సోయాబీన్‌ విత్తనాన్ని కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, హాకాసహా ప్రైవేటు కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఖరీఫ్‌ కోసం దాదాపు 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించారు. అయితే ప్రైవేటు కంపెనీలు ఇక్కడే పెద్ద మోసానికి తెగబడ్డాయి.

తెలంగాణలో వాతావరణం అనుకూలించకపోవడంతో సోయాబీన్‌ విత్తన పంట సరిగా లేదని ముందుగానే గుర్తించి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కొనుగోలు చేశాయి. వాటన్నింటినీ తెలంగాణలోనే ఉత్పత్తి చేసినట్లుగా రాష్ట్ర విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థను నమ్మించాయి. చివరకు తెలంగాణ ట్యాగ్‌లు వేయించుకోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచిత్రమేంటంటే ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 10–15 వేల మంది రైతుల ఆధార్‌కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు సేకరించి వారు పండించినట్లుగా ఆధారాలు సృష్టించినట్లు సమాచారం. కానీ మధ్యప్రదేశ్‌ వంటి చోట నాసిరకపు విత్తనాలు కొని ఈ రైతులు పండించినట్లుగా నమ్మబలికి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధిక ధరలు పెట్టి కొనుగోలు
బహిరంగ మార్కెట్‌లో సోయాబీన్‌కు ధర చాలా తక్కువ ఉన్నప్పటికీ, విత్తనానికి మాత్రం అంతకు రెట్టింపు ధరకు విక్రయించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఈ ఏడాది నిర్ణయించింది. ధర ప్రభావం తెలియకుండా ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపేలా సబ్సిడీ శాతాన్ని చూపడం గమనార్హం. సోయాబీన్‌ వాస్తవ ధర క్వింటాలుకు రూ. 6,150 ఉండగా, ప్రభుత్వం రైతులకు 40.65 శాతం సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. అంటే రూ. 2,500 సబ్సిడీ ఇస్తారు. రైతులు రూ. 3,650 చెల్లించాల్సి ఉంటుంది.

సీఎం కేసీఆర్‌ రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుంటే, అందుకు విరుద్ధంగా రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా రైతులపై భారం వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.3,339 ప్రకటించినప్పటికీ, రైతులకు మార్కెట్‌లో రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్యలోనే ధర అందింది. అదే సందర్భంలో ఇప్పుడు విత్తన కొనుగోలును మాత్రం క్వింటాకు రూ. 5,500 చేసి, రవాణా ఇతరత్రా చార్జీలకు క్వింటాకు రూ.600 చొప్పున కలుపుతూ మొత్తం గా రూ. 6,150కు ధర ఖరారు చేశారు.

వాస్తవానికి మార్కెట్‌లో సోయాబీన్‌ ధర రూ.3వేల లోపు మాత్రమే ఉంది. అటువంటిది క్వింటాకు రూ. 5,500 పెట్టి విత్తన కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేయడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రాసెసింగ్‌కు, ప్యాకింగ్, రవాణాకు అన్నింటికి కలిపినా రూ.5,400 వరకు మించదని, అటువంటిది రూ. 6,100 చెల్లించడంలో మతలబు ఏమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఒక క్వింటాకు రూ.500 నుంచి రూ.700 వరకు చేతులు మారుతున్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు