అలం‘పురం’ ఉలిక్కిపాటు

25 Apr, 2018 11:49 IST|Sakshi
ప్రజలతో మాట్లాడుతున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

తెల్లవారుజామున కార్డెన్‌ సెర్చ్‌

ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇల్లిల్లూ సోదా

36 వాహనాల స్వాధీనం

అలంపూర్‌ రూరల్‌: తెల్లవారుతుండగా అలంపూర్‌లో పోలీసులు బలగాలు దిగాయి.. ప్రజలంతా గాడ నిద్రలో ఉండగా పోలీసులు ఇళ్లు తట్టడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోదాలు చేస్తున్నామని.. మీ  ఆధార్‌కార్డులు.. వాహనాల పత్రాలు.. ఇళ్ల పత్రాలు చూయించాలని అడిగితే ముందు ప్రజలకు విషయం ఏంటో అర్థం కాక తికమక పడ్డారు. తర్వాత శాంతిభద్రతల కోసం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారని చెప్పడంతో ఊపరిపి పీల్చుకున్నారు. 

ఎస్పీ రెమారాజేశ్వరి నేతృత్వంలో..
అలంపూర్‌లో మంగళవారం తెల్లవారుఝామున 4గంటల నుంచి  కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సుమారు 80 మంది పోలీసులు, ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఏడు మంది ఎస్‌ఐలు 8 బృందాలుగా విడిపోయి అలంపూర్‌ పట్టణాన్ని జల్లెడ పట్టారు. కాలనీల్లో తిరుగుతూ ఇళ్లల్లో సోదాలు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. ఒక్కో బృందం  ఒక్కో కాలనీలో పర్యటించింది. ఇళ్లల్లో ఎవరైన కొత్త వ్యక్తులు ఉన్నారా.? వారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు.? ఏ పని నిమిత్తం ఇక్కడ మకాం వేశారు. వారి ఆధార్‌ నెంబర్‌లు ఎక్కడున్నాయి.. ఇలా వివిధ కోణాల్లో ప్రశ్నలు వేస్తూ ప్రజలను విచారణ చేశారు. అనుమానం వచ్చిన వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకుని వదిలేశారు. అలాగే వాహనాలను నిలిపి వాటి పత్రాలను పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పత్రాలు చూయించిన వారి వాహనాలను మళ్లి వారికి అప్పగించారు.  

ప్రజలతో ఎస్పీ మాటామంతి..  
పోలీసులు ఉన్నట్టుండి ఎందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు..? ఎవరికైనా తెలుసా.. పోలీసులు మీ ఇళ్లకు వచ్చారా.? ఏం అడిగారు.? చెప్పండి అంటూ ఎస్పీ రెమారాజేశ్వరి స్థానిక ప్రజలను ప్రశ్నించారు. దీన్ని కార్డెన్‌ సెర్చ్‌ అంటారని, నేరాలను అదుపు చేసేందుకు ముందస్తుగా ప్రజల భద్రత కోసమే ఇలా చేస్తున్నామని తెలిపారు. నేరాలు.. ఘోరాలు జరిగిపోయాక స్పందించడం కంటే ముందస్తుగా వాటిపై దృష్టి పెట్టి ఆపేందుకు ఉపయోగపడుతుందన్నారు. కొత్త వ్యక్తులకు ఎవరు ఆశ్రయం ఇవ్వొద్దని.. వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని... నిజనిర్ధారణ చేసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. వాహనాల కొనుగోలు సమయాలలో కూడా పూర్తి పత్రాలను సరి చూసుకోవాలని లేని పక్షంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా పోలీసుశాఖ పేద డిపార్ట్‌మెంట్‌ అని.. తమ వద్ద ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఉండవని.. ప్రజల సహకారంతోనే సీసీ కెమరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తనిఖీల్లో డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ రజిత, సీఐ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ఎస్‌ఐలు వాస ప్రవీణ్‌కుమార్‌ విజయ్, గడ్డం కాశీ, పర్వతాలు, మహేందర్, భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు