మంచు తుపాను కమ్మేసింది

13 Sep, 2017 02:57 IST|Sakshi
మంచు తుపాను కమ్మేసింది
18,500 అడుగుల ఎత్తుకు వెళ్లా..
- సామాన్యులెవరూ వెళ్లలేరు
మైనస్‌ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలుంటాయి
లడఖ్‌ పర్యటనపై ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి
 
సిరిసిల్ల: ‘దేశ సరిహద్దుల్లో మన సైన్యం నిత్యం కంటికి రెప్పలా కాపలాకాసే విధానాన్ని కళ్లారా చూశా.. సముద్రమట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఆక్సిజన్‌ లభించని మంచుకొండల్లో గస్తీ తిరిగే ఆర్మీ.. ఎవరికి ఏం జరిగినా జనావాసాలకు చేరాలంటే కనీసం 8 గంటలు ప్రయాణించాల్సిందే.. ఇలాంటి ప్రాంతంలో రేయింబవళ్లు మనవాళ్లు రక్షణగా ఉండడం నిజంగా గొప్ప విషయం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి అన్నారు. 1959లో సీఆర్‌ïపీఎఫ్‌ గస్తీ బృందాన్ని చైనా బలగాలు దొంగదెబ్బ తీసి.. మెరుపు దాడి చేయడంతో 20 మంది జవాన్లు చనిపోయారు.. వారి త్యాగాన్ని స్మరిస్తూ ఏటా లడఖ్‌ ప్రాంతంలోని హాట్‌ స్ప్రింగ్‌లో నిర్మించిన అమరజవాన్ల స్థూపానికి నివాళులు అర్పిస్తుంటారు.

ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది అధికారుల బృందం లడఖ్‌ వెళ్లింది. ఆ బృందంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి ఒక్కరే వెళ్లారు. 2013 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన విశ్వజిత్‌.. గత ఆగస్టు 21 నుంచి ఈనెల 10 వరకు 20 రోజుల పాటు దేశ సరిహద్దుల్లోకి వెళ్లి భారత వీరజవాన్లకు నివాళి అర్పించి వచ్చారు. ఈ సందర్భంగా తన పర్యటన అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
 
మంచుపర్వతాల మధ్య ప్రయాణం..
చండీగఢ్‌ నుంచి వాహనంలో మా ప్రయాణం మొదలైంది. 3 రాత్రులు, 4 రోజులపాటు మా ప్రయాణం సుమారు వెయ్యి కిలోమీటర్లు సాగింది. నిజానికి ఆ రోడ్లు అంతగా బాగుం డవు. గుట్టలు, మంచుపర్వతాలతో నిండి ఉంటుంది. అందుకే అంతసమయం పట్టింది.  
 
ఇద్దరు అధికారులు వెనక్కి వచ్చారు..
హాట్‌స్ప్రింగ్‌కు చేరడానికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. మానసికంగా దృఢత్వం కావాలి. ఎందుకంటే భూమికి 16,000 అడుగుల ఎత్తులో గాలిలో ఆక్సిజన్‌ ఉండదు. ఆస్తమా వంటి శ్వాసకోశవ్యాధులతో బాధపడే వారు రాకూడదు. నాతోపాటు వచ్చిన ఇద్దరు అధికారులు ముందుకు సాగలేక వెనక్కి వచ్చారు. నాకు ఐపీఎస్‌ ట్రెయినింగ్‌లో కశ్మీర్‌ లోని అనంతనాగ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. మా వెంట భారత ఆర్మీ జవాన్లు, ఐటీ బీపీ బలగాలు హాట్‌స్ప్రింగ్‌ వరకు వచ్చాయి.
 
నివాళి అనిర్వచనీయమైన అనుభూతి
చైనా సరిహద్దుల్లో ఎడారిని తలపించే మంచు గుట్టల మధ్య.. హాట్‌స్ప్రింగ్‌ వద్ద అమరులైన జవాన్లకు నివాళి అర్పించడం అనిర్వచనీ యమైన అనుభూతిని ఇచ్చింది. మరోసారి అవకాశం వస్తే.. మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. 
 
మంచుతుపాను కమ్మేసింది..
సాయుధ పోలీసుల మధ్య హాట్‌స్ప్రింగ్‌కి చేరుకున్నాం. అక్కడి ఆర్మీతో కలిసి నివాళి అర్పించిన తర్వాత ఒక్కడినే బైక్‌పై కొంత ముందుకు వెళ్లాను. నా సహచరులంతా వద్దని వారించారు. కానీ వెళ్లాను. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్‌ కరువైంది.  వెనక్కి వద్దామని నిర్ణయించుకునే లోగానే మంచుతుపాను కమ్మేసింది. కొంతసేపు ఆ తుపానును ఆస్వాదించి తిరిగి వెనక్కి వచ్చాను. అక్కడేం జరిగినా వైద్యం అందా లంటే 8 గంటలు ప్రయాణించాల్సిందే. ఫోన్లు పనిచేయవు. కనుచూపు మేరలో మంచు కనిపిస్తుంది. నేను వెళ్లి వచ్చిన తెల్లారే ఆ ప్రాంతంలో హెలిక్యాప్టర్‌ క్రాష్‌ అయింది. 

మన జవాన్ల సేవలకు సలాం..
అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో చలిలో, మంచు తుపానుల్లో మన జవాన్లు సరిహ ద్దుల్లో గస్తీ తిరగడం కళ్లారా చూశాను. వాళ్ల కు సలాం చేయాలనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కార్గి ల్, లడఖ్, లే సరిహద్దుల్లో మన ఆర్మీ గస్తీ సేవలు అద్భుతం. నేను చిన్నప్పుడు చదు వుకున్న స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో జై జవాన్‌.. జై కిసాన్‌ అన్న నినాదాలు మళ్లీ స్ఫురణకు వచ్చాయి. అందుకే దేశానికి సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్‌కు.. అన్నం పెట్టే రైతు కు మనం ఎప్పుడు రుణపడి ఉండడమే మన వారికి ఇచ్చే నిజమైన గౌరవం. 
మరిన్ని వార్తలు