ఇక్కడ ఉండాలంటే ‘ప్లేగ్‌ పాస్‌పోర్టు’ తప్పనిసరి

19 May, 2020 09:05 IST|Sakshi

హైదరాబాద్‌లో ఉండాలంటే ‘ప్లేగ్‌ పాస్‌పోర్టు’ తప్పనిసరి

విదేశీయుల రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు

రైల్వే స్టేషన్లలోనే ప్రత్యేక తనిఖీలు 

అంటువ్యాధుల నియంత్రణపై నిజాం ప్రత్యేక దృష్టి

సాక్షి, సిటీబ్యూరో: ప్లేగ్‌ పాస్‌పోర్టు.. ఇప్పుడు ఈ పదం వినడానికి కొద్దిగా ఆశ్చర్యంగానే అనిపించినా ఆ రోజుల్లో విదేశీయులు హైదరాబాద్‌లో కొంతకాలం ఉండాలంటే తప్పనిసరిగా ప్లేగ్‌ పాస్‌పోర్టు ఉండి తీరాల్సిందే. ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రోజుల్లో స్పానిష్‌ ఫ్లూ, ప్లేగ్‌ వంటి మహమ్మారులు ప్రజలను కబలిస్తున్నాయి. అలాంటి సమయంలో బ్రిటీష్‌ పాలిత ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ రాజ్యానికి వచ్చే వారికి ప్లేగ్‌ పాస్‌పోర్టులను అందజేసేవారు. రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం ఉండేది. విజయవాడ, మద్రాస్‌ వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో వైద్యులు అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత వారిని హైదరాబాద్‌లోకి అనుమతించేవారు. (‌క్వారంటైన్‌లో యువకుడి ఆత్మహత్య)  

ఈ పరీక్షల అనంతరం వారికి హైదరాబాద్‌లో తిరిగేందుకు ఈ ప్లేగ్‌ పాస్‌పోర్టు లభించేది. అప్పటికి హైదరాబాద్‌ పూర్తిగా ఒక స్వతంత్రమైన దేశం కావడంతో బ్రిటీష్‌ ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా దీనిని తీసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు, తమ సొంత కరెన్సీని నిజాం కరెన్సీలోకి మార్చుకునేందుకు కూడా  రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక సదుపాయం ఉండేది. అలా 1915 నుంచే ప్లేగ్‌ వంటి మహమ్మారులు విజృంభిస్తున్న రోజుల్లో ఈ ప్లేగ్‌ పాస్‌పోర్టును కూడా తప్పనిసరి చేశారు. (తల్లి ప్రాణం తీసిన కొడుకు క్రికెట్‌ గొడవ)

క్వారెంటైన్‌ కూడా ఆ రోజుల్లోనే.. 
ఆ రోజుల్లో ఎలుకల ద్వారా ప్లేగు వ్యాధి ప్రబలింది. విదేశాల నుంచి వచ్చే నౌకల ద్వారా ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు చరిత్ర చెబుతోంది. ఇటలీలో ఇలాంటి నౌకల్లో వచ్చేవారిని 40 రోజుల పాటు ఊళ్లోకి  రాకుండా నౌకలోనే ఉంచేవారు. ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో నిజాం నవాబు స్పానిష్‌ ఫ్లూ మహమ్మారిని అరికట్టేందుకు క్వారంటైన్‌ పద్ధతిని పాటించారు. అప్పట్లో నగర శివార్లలో ఉన్న ఎర్రన్నగుట్టపై గుఢారాలు వేసి వ్యాధిగ్రస్తులను అక్కడికి తరలించి చికిత్స అందించారు. స్పానిష్‌ ఫ్లూ బాగా వ్యాప్తి చెందుతున్న రోజుల్లో సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి, ముషీరాబాద్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఐసొలేషన్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. (మైనర్‌ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి )

1915లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్‌ ఆస్పత్రి 1923 వరకు ప్రస్తుతం ఫీవర్‌ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న ఎర్రన్నగుట్ట మీదే ఉండేది. ఈ ప్రాంతం ఆ రోజుల్లో హైదరాబాద్‌ నగరానికి చాలా దూరంగా ఉన్నట్లే లెక్క, 1923లో ఎర్రన్నగుట్ట పైన ఉన్న క్వారెంటైన్‌ ఆసుపత్రిని ప్రస్తుతం ఫీవర్‌ ఆసుపత్రికి మార్చారు. అలా క్వారంటైన్‌ కోసం ఉపయోగించడం వల్ల దీన్ని క్వారంటైన్‌ ఆస్పత్రి అనేవారు. కాలక్రమంలో కోరంటి దవాఖానాగా, ఆ తర్వాత ఫీవర్‌ ఆస్పత్రిగా ప్రాచూర్యంలోకి వచి్చంది.  సమగ్ర వివరాలతో జారీ.. 

సమగ్ర వివరాలతో జారీ..
ఈ పాస్‌పోర్టులో సందర్శకుడి పూర్తి వివరాలను నమోదు చేసేవారు. అప్పట్లో హైదరాబాద్‌ను సందర్శించిన ప్రముఖ చరిత్రకారుడు రాబర్ట్‌ చావెలో ఇందుకు సంబంధించిన తన అనుభవాలను ఆయన 1921లో రాసిన  ’మిస్టీరియస్‌ ఇండియా’ అనే పుస్తకంలో వెల్లడించారు. హైదరాబాద్‌లో తాను తిరిగిన ప్రాంతాలు, అనుభవాలను తెలియజేశారు. ‘రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. ఒక పోలీస్‌ అధికారి వచ్చి ప్రశ్నించారు. తాను ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండేది, ఎక్కడెక్కడకు వెళ్లాల్సి ఉంది వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. అంతేకాదు.. తనకు మొదటి రౌండ్‌ ప్లేగు పరీక్ష పూర్తయినా రెండో దఫా స్క్రీనింగ్, శానిటేషన్‌ టెస్ట్‌ కోసం పంపారు.’ అని పేర్కొన్నారు. (కరోనాపై విచారణకు భారత్‌ ఓకే )

అప్పటికే తాను హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్లేగ్‌ పాస్‌పోర్టు కలిగి ఉండటం వల్ల దాన్ని పరీక్షించి తదుపరి వైద్య పరీక్షల కోసం సివిల్‌ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించినట్లు చావెలో తన పుస్తకంలో ప్రస్తావించారు. అప్పట్లో ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్‌ చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, సమగ్రమైన వివరాలతో ప్లేగ్‌ పాస్‌పోర్టు ఇచ్చేవారు. ఇదిలేని వారిని హైదరాబాద్‌లోకి అనుమతించేవారు కాదని ఇంటాక్‌ కన్వీనర్‌ అనురాధారెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు