సదా మీ సేవలో..

14 Jan, 2019 02:10 IST|Sakshi

ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసుశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ప్రజలకు మరింతగా అందించాల్సిన సేవలు, ప్రజలు కోరుకుంటున్న అంశాల ప్రాతిపదికగా ‘కమ్యూనిటీ ఫెల్ట్‌ నీడ్స్‌’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యాచరణపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటికే కమిషనర్లు, ఎస్పీలు, జోన్ల డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత పోలీసింగ్‌ సేవలు, సర్వీస్‌ డెలివరీ వేగవంతం, అంకితభావ సేవలపై సూచనలు చేశారు. దీంతో పోలీసుశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేపట్టింది. 

ప్రతిపాదనల రూపంలో... 
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి స్వీకరించే సూచనలు, అంశాలు, ఫిర్యాదులపై పైస్థాయి అధికారులు నివేదిక అందించాలని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి గ్రామం నుంచి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ వరకు ఉన్న ప్రధాన సమస్యలు, కావాల్సిన సేవలపై రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఆయా నివేదికలపై చర్చించనున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలున్నాయో వాటి పరిష్కారానికి కావల్సిన చర్యలను తిరిగి కింది స్థాయి అధికారులు, సిబ్బందికి సూచించనున్నారు. దీనివల్ల ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం పెరగడంతోపాటు సిబ్బంది సైతం అంకితభావ సేవలు అందించేందుకు ఇది ఫీడ్‌ బ్యాక్‌ విధానంగా కూడా ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి 15 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

ఠాణాల నుంచి జిల్లాల వరకు
మండల పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల నుంచి సర్కిల్‌ లెవల్, అర్బన్‌ లెవల్, జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ లెవల్లో ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో కాలనీలు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, యూత్‌ వింగ్‌లతో 15 రోజులపాటు ‘కమ్యూనిటీ ఫెల్ట్‌ నీడ్స్‌’పై సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారంలో పోలీసుల నుంచి కావాల్సిన సహాయ సహకారాలపై ప్రజల నుంచి సూచనలు కోరనున్నారు. భద్రత, రక్షణ వ్యవహారంలో ఇంకా ఎలాంటి సేవలు, కార్యక్రమాలు కావాలనుకుంటున్నారో సలహాలు స్వీకరించబోతున్నారు. ఈ మేరకు గత మూడు రోజుల నుంచి అన్ని జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు కిందిస్థాయి సిబ్బందితో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీ/ఏసీపీలు ఈ కార్యక్రమాలపై సూచనలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు