రైతు బీమాకు ప్రత్యేక యాప్‌

10 Jun, 2018 00:11 IST|Sakshi

ఇప్పటికే ఏఈవోల ట్యాబ్‌ల్లో...

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు జీవిత బీమా కోసం ప్రత్యేక యాప్‌ను వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) తయారు చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) ట్యాబ్‌ల్లో ఇన్‌స్టాల్‌ చేశారు. నామినీ, బీమా దరఖాస్తుల నమూనా ఆధారంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతుబంధు జీవిత బీమా పథకం అమలుకు ఈ నెల 4న ఎల్‌ఐసీతో వ్యవసాయశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలోని 30 జిల్లాలకు బీమాతో పాటు నామినీ దరఖాస్తులను పంపామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏఈవోలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులోని వివరాలను యాప్‌లో నమోదు చేసి, ఆ సమాచారాన్ని ఎల్‌ఐసీకి పంపనున్నారు. ఇక, క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ ఎప్పటికప్పుడు పరిశీలించనున్నది.

ఆధార్‌ కార్డు ఆధారంగా రైతుల వయసును నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జూలై మొదటి తేదీని పుట్టిన రోజుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్‌లో రైతుల సమాచారంతో పాటు ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయడం వల్ల డూప్లికేషన్‌కు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నమోదు చేస్తున్న వివరాల్లో ఏమైనా మార్పులు చేర్పులుంటే సవరించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. భూ రికార్డుల్లో చేస్తున్న మార్పులకనుగుణంగా సమాచారాన్ని నవీకరించుకునేలా ఆప్షన్లు ఇవ్వనున్నారు.  

మరిన్ని వార్తలు