‘విరి’జల్లు..

23 Nov, 2017 01:45 IST|Sakshi

ఇవాంకా రాక కోసం.. పూల సోయగం

హైటెక్స్‌కు వెళ్లే దారిపొడవునా పచ్చదనం.. పూల పరిమళం

దేశ, విదేశీ జాతుల పూలమొక్కలతో ప్రత్యేక ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: అందం.. ఆకర్షణ.. సుకుమారం.. ఈ అంశాల్లో మహిళలకు, పూలకు పోలికలు ఎన్నో.. ‘ఉమెన్‌ ఫస్ట్‌.. ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌’థీమ్‌తో వచ్చే వారం నగరంలో జరగనున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు(జీఈఎస్‌)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు మహిళలే ఎక్కువ మంది హాజరుకానున్నారు. దీంతో వారి మనసు దోచేలా, ఆకట్టుకునేలా దేశ, విదేశీ రకాలకు చెందిన పూలజాతులతో, విరబూసిన నిండు పువ్వులతో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అలంకరణ చేస్తోంది.

సదస్సుకు వేదికైన హైటెక్స్‌లోనూ, అటువైపు వెళ్లే వివిధ ప్రాంతాల్లో దారి పొడవునా, పార్కుల్లో ప్రత్యేక పూల మొక్కలను ఏర్పాటు చేస్తోంది. రంగురంగుల పూలు.. వాటిపై వివిధ వర్ణాల సీతాకోక చిలుకలు వాలుతుంటే చూసే వారు వహ్వా అనుకునేలా సీతాకోక చిలుకలను ఆకర్షించే మొక్కలకు ప్రాధాన్యమిస్తోంది. అందుకుగానూ విదేశీ జాతులైన గల్తీనియా, హెమీలియా తదితర పూల మొక్కలను తెప్పిస్తోంది.

వీటితోపాటు ఈ సీజన్‌లో పూసే బంతి, చామంతి, నందివర్థనం తదితరమైన పెద్దసైజులో ఉండి పూర్తిగా విరబూసే ఎఫ్‌1 హైబ్రిడ్‌ రకాలను ప్రత్యేకంగా పుణె తదితర నగరాల నుంచి రప్పిస్తోంది. ఈ మొక్కలకు కొంత ఖర్చు ఎక్కువే అయినప్పటికీ.. వచ్చే అతిథుల్ని, ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో ఉంచుకుని నిండుపూలతో కూడిన 40 వేల మొక్కలు తెప్పిస్తోంది. వివిధ రంగులు కలగలసిన అర్జెంటీనాకు చెందిన పెట్యూనియా, అందంగా ఉండే సిల్వియా తదితర రకాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈస్టిండియన్‌ స్క్రూ ట్రీగా పిలిచే ఐజోరా రకాలనూ అలంకరణలకు ఎంచుకున్నారు.

ప్రత్యేక శిల్పాలు..
జాతీయ స్థాయి అవార్డు గ్రహీత, వరంగల్‌కు చెందిన ప్రముఖ శిల్పకారుడు చిలువేరు మనోహర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర జంతువైన జింక శిల్పాన్ని 22 అడుగుల భారీ ఎత్తుతో తీర్చిదిద్దుతున్నారు. ఇంకా మహిషం తదితర విగ్రహాలు రూపొందిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో, ప్రజలతో కళలకున్న సంబంధాల్ని వివరించే ‘ఒడిస్సీ’ప్రాజెక్టులో భాగంగా ఆయన వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

జీఈఎస్‌ థీమ్‌లో ‘మహిళలు ప్రథమం..’ కావడంతో తొమ్మిది రూపాల్లోని మహిళా శక్తితో ‘నవదుర్గ’ను ప్రదర్శించనున్నారు. వీటన్నింటికీ వెరసి రూ.60 లక్షలు ఖర్చు చేస్తుండగా, ఈ నిధులన్నీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్‌) కింద ఐటీసీ, డీఎల్‌ఎఫ్, ఆదిత్య, బీఈ తదితర సంస్థలు ఆర్థిక సహకారం అందించినట్లు వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు.


పూల కుండీలు.. కూర్చునే బెంచీలు కూడా..
పూల కుండీల్లో ఉంచేందుకు మెక్సికోకు చెందిన ఆకుపచ్చ, ఎరుపు రంగు ఆకులు కలిగిన ప్రత్యేకమైన పోయిన్‌సెట్టియా రకాలు వినియోగిస్తున్నారు. స్త్రీమూర్తులతోపాటు ఏనుగులు, జింకలు తదితర రూపాల్లో కుండీలను రూపొందించారు. హైటెక్స్‌ ముందు, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో వర్టికల్‌ గార్డెన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

హెచ్‌ఐసీసీ గేట్‌ ముందు ప్రత్యేకంగా అల్యూమినియం నిర్మాణాలకు పచ్చదనం, పూల అలంకరణలు చేస్తున్నారు. రాత్రుల్లో కనిపించేందుకు స్పెషల్‌ లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కుల్లో పక్షులు, జంతువులు, పూలు, చెట్ల తీగల వంటి వివిధ థీమ్‌లతో కూడిన ప్రత్యేకమైన ఫైబర్‌ బెంచీలును సిద్ధం చేశారు. ఒక్కో బెంచీకి రూ.9,500 చొప్పున వంద బెంచీలు రెడీ చేశారు. బెంచీలతోపాటు చెట్లపైనా ప్రత్యేక బొమ్మలు వేయిస్తున్నారు. కళాకృతి ఆర్ట్‌గ్యాలరీ ఇందుకు సహకరిస్తోంది.

మరిన్ని వార్తలు