‘ఎకో’దంతుడికి జై!

2 Sep, 2019 01:33 IST|Sakshi

పర్యావరణంపై భక్తుల్లో పెరిగిన ధ్యాస 

గతేడాది మట్టి విగ్రహాల వాటా 43 శాతం 

ఈసారి 55శాతం మించుతుందన్న అంచనా 

ఏకదంతుడు.. క్రమంగా ‘ఎకో’దంతుడవుతున్నాడు..మట్టి గణపతికి జై..రంగు ప్రతిమలకు బై.. అంటున్నారు భక్తులు. మట్టి విగ్రహాలకే మొక్కుతున్నారు..నీటి వనరుల కాలుష్యాన్ని పెంచుతున్న ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌(పీవోపీ) మోజు నుంచి బయటపడుతున్నారు. నాలుగైదేళ్లుగా మట్టి విగ్రహాల వైపు భక్తజనం దృష్టి సారిస్తున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలపై ప్రత్యేక కథనం..  
- సాక్షి, హైదరాబాద్‌

సాగర్‌ నిమజ్జనంలో 43 శాతం మట్టివే.... 
గతేడాది నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైన విగ్రహాల్లో 43 శాతం మట్టివేనని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) లెక్కలు తేల్చింది. ఈసారి ఆ సంఖ్య 55 శాతాన్ని దాటుతుందని అంచనా. ప్రజల్లో అవగాహన మెరుగుపడిందన్న స్పష్టమైన సంకేతాలున్నాయని పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ చెప్పారు. నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా అవగాహన పెరిగిందన్నారు. 

ఎకోఫ్రెండ్లీ గణపతి ఐడియాలు కొన్ని..
చెరకు గణపతి...
తమిళనాడులో 20 మంది కార్మికులు రెండు టన్నుల చెరకుతో భారీ గణపతిని తయారుచేశారు. ఆ తరువాత నిమజ్జనానికి బదులు ఆ చెరకుగడలను తీసి, భక్తులందరికీ పంచిపెట్టడంతో ఇప్పుడు చాలా చోట్ల చెరకు గణపతులు వెలుస్తున్నారు. తద్వారా వేస్టేజ్‌ ఉండదు, భక్తులకు ఉపయోగకరంగానూ ఉంటుంది.  

గోబర్‌ గణేషుడు...
హిందువులు ఆవుని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవు నెయ్యికీ, పేడకూ అంతే పవిత్రత ఉంది. పేడ నీటిలో త్వరగా కరిగిపోతుంది. అందుకే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మట్టిలో ఆవుపేడని కలిపి వినాయక విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలుతో పాటు పవిత్రతకి పవిత్రతా చేకూరుతుంది.  

చేప మిత్రుడిగా...
నిమజ్జనం చేసే నీటిలో ఉన్న చేపలకి ప్రమాదకరంగా మారకుండా ఉండడమే కాకుండా ఫిష్‌ ఫ్రెండ్లీ గణపతులను ముంబైకి చెందిన స్ప్రౌట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ట్రస్ట్‌ ఎన్జీవో తయారుచేస్తోంది. ఆనంద్‌ పెంధార్కర్‌ అనే పర్యావరణ వేత్త ఫిష్‌ ఫ్రెండ్లీ వినాయకుల తయారీని పరిచయం చేశారు. ఇలాంటి గణపతి విగ్రహాలు చేపలకు హానిచేయకపోవడమే కాదు, చేపలకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే చేపలు తినే పదార్థాలతోనే ఈ గణేషులను తయారుచేస్తారన్నమాట. 

తీపి గణపతి...
వినాయకచవితికి కొంత మధురంగా మలచాలనుకున్న ముంబైకి చెందిన రింటూ రాథోడ్‌ 50 కేజీల చాక్‌లెట్‌ గణేషుడిని తయారు చేసింది. దీన్ని నీటిలో నిమజ్జనం చేయకుండా ఆ చాక్లెట్‌నంతా తీసి పిల్లల నోళ్లు తీపిచేశారు. అంతేనా పాలల్లో నిమజ్జనం చేసి మిల్క్‌షేక్‌ని భక్తులకు పంపిణీ చేశారు.

గణపతిని విత్తుకోండిలా...
ముంబైకి చెందిన దత్తాద్రి కొత్తూర్‌ ఓ సరికొత్త గణపతిని తయారుచేశారు. విత్తగణపతి అన్నమాట. అన్ని గణపతి విగ్రహాల్లా దీన్ని నీటిలో ముంచక్కర్లేదు. కుండీలో పెట్టుకుని కొద్దిగా నీరు పోస్తుంటే చాలు పండుగ రోజులు పూర్తయ్యేనాటికి మీ యింట్లో మీకు నచ్చిన కూరగాయ మొక్కల్ని ప్రసాదించేస్తాడు ఎకోఫ్రెండ్లీ వినాయకుడు. విత్తనాలేవైనా మీ యిష్టం, ధనియాలో, బెండకాయ, తులసి విత్తనాలో ఏవైనా మీకు కావాల్సిన విత్తనాలను మట్టితో కలిపి గణేషుడిని తయారుచేయడమే.

తలా ఓ చేయి... 
పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు,ప్రభుత్వ విభాగాల అధికారులు ఈసారి మట్టి విగ్రహాలపై ముమ్మర ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రసార మాధ్యమాలు కూడా తోడవడంతో జనంలో మార్పు కనిపిస్తోంది.  
- మట్టి విగ్రహాలపై దేవాలయాల్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు.  
గతేడాది 40 వేల మట్టి విగ్రహాలను రూపొందించి ఉచితంగా అందజేసిన హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఈ సారి ఆ సంఖ్యను 60 వేలకు పెంచింది.  
వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నీటి వనరులకు చెడుపు చేయకుండా సహజ రంగులతో విగ్రహాలు తయారు చేశారు.  
నగరంతోపాటు జిల్లాల్లో ఉన్న కొన్ని కుమ్మరి సంఘాలు కూడా మట్టి విగ్రహాల తయారీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి.  
కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, భక్త మండళ్లు, మహిళా మండళ్లు కూడా మట్టి విగ్రహాలకే జైకొట్టాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు