పొర‘పాట్లు’ లేకుండా ఓటరు జాబితా!

16 Sep, 2018 01:24 IST|Sakshi
శనివారం హైదరాబాద్‌లో కలెక్టర్‌ రఘునందన్‌రావుతో కలసి సమావేశం నిర్వహిస్తున్న దానకిశోర్‌

     తప్పుల సవరణకు తొలిసారిగా ‘రెవెన్యూ’సేవలు 

     రంగంలోకి ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహసీల్దార్లు, 100 మంది వీర్వోలు 

     మరణించినవారి పేర్ల తొలగింపు.. కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ 

     సందేహాల నివృత్తికి టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800–599–2999 

     హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఒకే వ్యక్తి పేరు రెండుచోట్ల, ఒకరి పేరు దగ్గర మరొకరి ఫొటో ఉంటే తొలగించడంతోపాటు అర్హులైనవారి ఓట్లు, ముఖ్యంగా వీఐపీలవి గల్లంతు కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందుకుగాను తొలిసారిగా రెవెన్యూ సేవల్ని కూడా వినియోగించుకోనున్నారు. హైదరాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవి నేతృత్వంలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, 15 మంది తహసీల్దార్లు, 100 మంది వీఆర్వోలు జిల్లాలోని ఓటర్ల జాబితాను జల్లెడ పట్టనున్నారు. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారి పేర్లను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావుతో కలసి హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ నిర్వహించిన రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. గడిచిన ఐదేళ్లలో జిల్లాలో 1,22,700 మంది మరణించినట్లు రికార్డులు తెలుపుతుండగా, వీరి ఓట్లూ తొలగించలేదు. కొత్తగా ఓటు హక్కు పొందేవారు సాధారణంగా జనాభాలో 3.75 శాతం ఉండగా, ఆ మేరకు నమోదు కాలేదు. వీటిపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోనున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ దానకిశోర్‌ ఈ వివరాలు వెల్లడించారు. ‘ముసాయిదా జాబితాలను మూడురోజులు పరిశీలించాక, గుర్తించిన లోపాల్ని సరిదిద్దేందుకు ఎన్నికల సిబ్బంది ఇంటింటికీ వెళతారు.

ఒక్కరికే ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే తొలగిస్తారు. ఇతర జిల్లాల పరిధిలో ఉన్నా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఇటీవల అందించిన ఆధునిక సాఫ్ట్‌వేర్‌ ఇ.ఆర్‌.ఓ నెట్‌ 2.5 ద్వారా గుర్తిస్తారు. నోటీసులు అందజేసి ఓటరు కోరుకున్న చోట మాత్రమే ఉంచి, మిగతా చోట్ల తొలగిస్తారు. ఈ ప్రక్రియను హైదరాబాద్‌ కలెక్టర్‌ రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ఆమ్రపాలి పర్యవేక్షిస్తార’ని తెలిపారు. నూతన ఓటర్ల నమోదు, చిరునామా మార్పిడి, అనర్హుల తొలగింపు తదితర అంశాలపై సందేహాల నివృత్తి కోసం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 15 లైన్లతో టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–599–2999ను శనివారం నుంచే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుకు నగరంలో 600కుపైగా ఉన్న సీనియర్‌ సిటిజన్‌ క్లబ్‌ల సహకారం తీసుకుంటామన్నారు. దివ్యాంగ ఓటర్ల పేర్లూ నమోదు చేయడంతోపాటు పోలింగ్‌ బూత్‌ల్లో వారు ఓటేసేందుకు ర్యాంపులు, తదితర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 

నియోజకవర్గంలో వెయ్యి వీఐపీ ఓట్ల పరిశీలన.. 
ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి మంది వీఐపీల ఓట్లను ఎన్నికల సిబ్బంది పరిశీలిస్తారని దానకిశోర్‌ చెప్పా రు. ఓటరు జాబితాలో వారి పేర్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూడటంతోపాటు ఫొటోలు, చిరునామా సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారన్నారు. ఇప్పటి వరకు పేర్ల నమోదు, చిరునామా మార్పిడి తదితర అంశాలకు సంబంధించి ఆయా ఫారాల ద్వారా 6,680 క్లెయిమ్‌లందాయని, ఇవి కాక ఆన్‌లైన్‌ ద్వారా అందాయన్నారు.

ఓటరు చైతన్య ప్రచార రథాలు
ఓటర్ల నమోదు, సవరణతోపాటు అర్హులైన వారందరూ పోలింగ్‌లో పాల్గొనేలా చేసేందుకు ఓటరు చైతన్య ప్రచార రథాలను ఏర్పాటు చేయనున్నట్లు దానకిశోర్‌ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో  ఆధునిక సాంకేతికతతో కూడిన ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్‌లూ వినియోగిస్తారని, దీంతో ఓటరు తాము వేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు