మహిళల కోసం ప్రత్యేక మెట్రో స్టేషన్‌

7 May, 2018 17:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా తరుణి పేరిట మధురానగర్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా మహిళల కోసం ఓ కోచ్‌లో కొంత భాగాన్ని కేటాయించామన్నారు. డిమాండ్‌ను బట్టి పూర్తి కోచ్‌ను కేటాయిస్తామని చెప్పారు. మెట్రో రైలు కేవలం రవాణా సాధనంగానే కాకుండా నగరాభివృద్ధిలో భాగస్వామ్యంగా మారుతుందని తెలిపారు.

మెట్రో స్టేషన్లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జులైలో ఎల్బీనగర్ - అమీర్‌పేట్, అక్టోబర్‌లో అమీర్‌పేట్ - హైటెక్ సిటీ లైన్‌ను పూర్తి చేస్తామన్నారు. 2019లో ఎంజీబీఎస్- జేబీఎస్ లైన్లు అందుబాటులోకి వస్తుందన్నారు. రెండో ఫేజ్‌లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మెట్రోను శంషాబాద్ వరకు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

 

మరిన్ని వార్తలు