లైఫ్‌‘లైన్‌’ లేదాయె!

1 Nov, 2019 11:22 IST|Sakshi

నగరంలో అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక లైన్‌ ఏర్పాటుకు ఇబ్బందులు  

రోడ్ల స్థితిగతులు, పరిస్థితుల నేపథ్యంలో అవాంతరాలు  

‘కామన్వెల్త్‌ లైన్‌’ తరహాలో ఏర్పాటుకు సిటీ ట్రాఫిక్‌ పోలీసుల యోచన

సాక్షి, సిటీబ్యూరో: రోగులు, క్షతగాత్రులను అత్యవసరంగా తరలించే అంబులెన్స్‌ల కోసం రహదారులపై ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేసేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘కామన్వెల్త్‌ లైన్‌’ను పరిశీలించిన నగర పోలీసు అధికారులు ఆ తరహాలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే సిటీలోని రోడ్ల స్థితిగతులు, పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రత్యేక లైన్‌ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య రంగానికి కేంద్రంగా మారిన నగరంలో అనేక కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ పెద్దాస్పత్రులైన ఉస్మానియా, గాంధీ, మెటర్నిటీ దవాఖానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిటీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రోగులను వైద్యం కోసం అంబులెన్స్‌లో సిటీకి తీసుకొస్తుంటారు. ఆయా వాహనాలు నగర శివార్ల వరకు వేగంగా వచ్చినా, సిటీలోకి రాగానే ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి. ఫలితంగా ఒక్కోసారి రోగుల పరిస్థితి చేయిదాటిపోతోంది. సాధారణ రోజుల్లో కంటే ట్రాఫిక్‌ జామ్‌ అధికంగా ఉండడం, వర్షం కురవడం తదితర సమయాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయి. 

‘గ్రీన్‌ చానల్‌’ స్ఫూర్తిగా..  
ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ప్రజల్లో అవయవ దానంపై ఇటీవల అవగాహన పెరిగింది. దీంతో ఇతర నగరాలతో పాటు రాష్ట్రాల్లోనూ బ్రెయిన్‌డెడ్‌ స్థితికి చేరినవారి అవయవాలను ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు తరలించచడం జరుగుతోంది. ఆయా సందర్భాల్లో వైద్యులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అవయవాలను తీసుకెళ్లే అంబులెన్స్‌లు విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరుకునే వరకు సమన్వయంతో పని చేస్తున్నారు. ఈ అంబులెన్స్‌ల కోసం ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తూ ‘గ్రీన్‌ చానల్‌’ ఇస్తున్నారు. ఫలితంగా అవయవదానానికి సంబంధించిన లక్ష్యం నెరవేరుతోంది. ఈ ‘గ్రీన్‌ చానల్‌’ విధానాన్ని నగర ట్రాఫిక్‌ పోలీసులు స్ఫూర్తిగా తీసుకున్నారు. అవయవదానం సందర్భంలోనే కాకుండా ఇతర సమయాల్లోనూ అంబులెన్స్‌లో ప్రయాణించే రోగుల పరిస్థితి విషమంగా ఉండే ఆస్కారం ఉందని, కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ‘గోల్డెన్‌ అవర్‌’ దాటిపోవడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయని భావించిన అధికారులు నగరంలో అంబులెన్స్‌లకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారులకు కుడివైపున కనీసం నాలుగడుగుల దారిని అంబులెన్స్‌ల కోసం కేటాయించాలని భావించారు. ఇందుకు ఢిల్లీలో కామన్వెల్త్‌ గేమ్స్‌ సమయంలో అమలు చేసిన విధానాన్ని అధ్యయనం చేశారు. ఈ ప్రత్యేక రూట్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అత్యంత రద్దీ సమయాల్లో, ప్రధాన ఆస్పత్రులున్న 15 మార్గాల్లో అమలు చేయాలని యోచించారు. అయితే సిటీలోని రహదారుల పరిస్థితి, వాటి వెడల్పు అన్ని చోట్ల ఒకేలా లేకపోవడం, బాటిల్‌ నెక్స్‌ తదితరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు అమలులో ఇబ్బందులను గుర్తించారు. 

ఏంటీ ‘కామన్వెల్త్‌ లైన్‌’?
2010లో ఢిల్లీలో కామన్వెల్త్‌ గేమ్స్‌ జరిగిన సమయంలో ఆటగాళ్లకు అక్కడి ప్రధాన హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి క్రీడాకారులు మైదానాలకు చేరుకోవడంలో ఎలాంటి ఆలస్యానికి తావులేకుండా అక్కడి పోలీసు విభాగం చర్యలు తీసుకుంది. ప్రధాన రహదారులకు కుడివైపుగా ఓ లైన్‌ ఏర్పాటు చేసి, ఆ భాగానికి ‘కామన్వెల్త్‌ లైన్‌’గా మార్కింగ్‌ ఇచ్చింది. ఇందులో సాధారణ వాహనాలు ప్రయాణిస్తే రూ.2వేలు జరిమానా విధించింది. దీంతో ఆ ‘లైన్‌’ విజయవంతమై క్రీడాకారులకు ఇబ్బందులు తప్పాయి.  

సమస్యలను అధిగమిస్తాం  
‘కామన్వెల్త్‌ లైన్‌’ విధానం తరహాలో సిటీలో అంబులెన్స్‌ల కోసం ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేయాలంటే ఆర్టీఏ విభాగం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా 15 ప్రాంతాల్లో అధ్యయనం చేయాలని భావించాం. ఇప్పటికే వాహనచోదకులు అంబులెన్స్‌లకు దారి ఇస్తున్న నేపథ్యంలో వారిలో మరికొంత అవగాహన కల్పిస్తే ఈ విధానం విజయవంతమయ్యే అవకాశం ఉంది. అయితే సిటీలోని రోడ్లపై ప్రయోగాత్మక అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలను అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నాం. ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే అంబులెన్స్‌లకు ప్రత్యేక లైన్‌ విధానం అమలులోకి తీసుకొస్తాం.– సిటీ ట్రాఫిక్‌ పోలీసులు   

గ్రేటర్‌లో అంబులెన్స్‌లు ఇలా (లెక్కలు సుమారు)ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్సులు 4,500  
ప్రతిరోజు జిల్లాల నుంచి నగరానికి వచ్చి వెళ్లేవి 200, 108 అంబులెన్సులు 42
ఒక్కో 108 వాహనం రోజుకు సగటునఅటెండ్‌ అవుతున్న కేసులు 67  
ఆస్పత్రికి తరలించే సమయంలోమార్గమధ్యలోనే జరుగుతున్న ప్రసవాలు 12 

>
మరిన్ని వార్తలు