బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ప్రత్యేక శాఖ

13 Aug, 2015 03:09 IST|Sakshi
బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ప్రత్యేక శాఖ

- ఎక్సైజ్‌కు అనుబంధంగా కార్యకలాపాలు
- ఉద్యోగులను ప్రభుత్వశాఖలో విలీనం చేసేందుకే సీఎం మొగ్గు?
- నిబంధనలు ఒప్పుకోకపోతే మరో రెండు ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్)ను రద్దు చేయడంతో పాటు మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మద్యం అమ్మకాలు, డిపోల నిర్వహణ కోసం బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలపై ఆదాయపన్ను రూపంలో ఐటీ శాఖ రూ. 1,247 కోట్లను తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి అటాచ్ చేసుకుంది.

సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలంటూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చే సి, ప్రత్యేక శాఖగా కొనసాగించాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలమేరకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విధివిధానాలపై నివేదిక రూపొందించారు. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా ఏర్పాటయ్యే ప్రత్యేక శాఖ ద్వారా మద్యం డిపోల నిర్వహణ, రిటైల్ దుకాణాలకు సరఫరా తదితర పనులను కొనసాగిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగించే ఆలోచన
బేవరేజెస్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా 200 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. కార్పొరేషన్ రద్దయినా కొత్తగా ఏర్పాటయ్యే శాఖలో ఉద్యోగులు అవే విధులు నిర్వహిస్తారు. వీరిని ఏపీ తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకోవాలని భావించినప్పటికీ, ప్రభుత్వంలోకి తీసుకునేందుకే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకున్నా, వేతనాలు పాతవే చెల్లించాల్సి వచ్చినప్పుడు కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది.

ఉద్యోగ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్‌లో పనిచేసే వారికి పెన్షన్ విధానంలో తేడాలు ఉండడం ఒక్కటే ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. అవసరమైతే చట్టంలో సవరణలు చేసైనా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆర్థిక శాఖ అడ్డుచెబితే మాత్రం వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేసి డిప్యూటేషన్ మీద ఎక్సైజ్ అనుబంధ శాఖలో కొనసాగించడమా... కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడమా అనే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు