స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష

14 May, 2015 02:01 IST|Sakshi
స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష

ప్రైవేట్ మెడికల్ యాజమాన్య సీట్లపై సర్కారు నిర్ణయం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏఎఫ్‌ఆర్‌సీ ఆధ్వర్యంలో పరీక్ష ?
గతేడాదే ఫీజులు పెంచినందున మళ్లీ పెంచబోమన్న మంత్రి లక్ష్మారెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు  ఈ విద్యా సంవత్సరం నుంచే.. స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదే ఫీజులు పెంచినందున ఈసారి మళ్లీ పెంపు ఉండదని కూడా స్పష్టంచేసింది. ప్రత్యేక ప్రవేశ పరీక్ష, ఫీజుల పెంపు విషయాలపై ఇటీవల ప్రైవే ట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండుసార్లు చర్చించిన విషయం విదితమే. ఈ విషయమై ఆయన సీఎం కేసీఆర్‌తో చర్చించారు. సీఎం ఆమోదం మేరకు స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే..
 స్వచ్ఛంద సంస్థతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి అదెలా ఉంటుందో మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సీట్లకు, ఎలా పరీక్ష నిర్వహిస్తుందో..  ఇక్కడ కూడా అలాగే చేస్తామన్నారు. కాగా, తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం 35 శాతం ప్రైవేట్ యాజమాన్య కోటా సీట్లుగా నిర్ణయించి దానికే ప్రత్యేక ప్రవేశ పరీక్ష చేపట్టింది.
 
 ఆ ప్రకారం తెలంగాణలో 35 శాతం యాజ మాన్య కోటా కింద 735 సీట్లకు ప్రత్యేక పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది.  స్వచ్ఛంద సంస్థగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పరీక్ష చేపట్టింది. పర్యవేక్షణ బాధ్యతను అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) అప్పగించింది. మన ప్రభుత్వం కూడా వాటి ద్వారానే ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కౌన్సిలిం  గ్‌ను  ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీకే అప్పగించింది. మన ప్రభుత్వమూ అదే చేసే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌లో ప్రైవేట్ యాజ మాన్యాలు కూడా పాల్గొనే వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయి.
 

>
మరిన్ని వార్తలు