‘దివ్యం’గా ఓటేయొచ్చు

6 Apr, 2019 16:02 IST|Sakshi

వికలాంగుల ఫ్రెండ్లీ పోలింగ్‌ స్టేషన్లు  

సదుపాయాలు వృద్ధులు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులకు వర్తింపు 

పోలింగ్‌ కేంద్రానికి,  రాకపోకలకు ఉచిత  రవాణా సౌకర్యం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంద శాతం పోలింగ్‌పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందులో భాగంగా దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. పోలింగ్‌ స్టేషన్లను దివ్యాంగుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతోంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులు సులభతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వారు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని.. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 44,386 మంది దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేలా ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.  

మెరుగుపడుతున్న ఓటింగ్‌ శాతం.. 
గతంలో వికలాంగులు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉండేవారు. శరీరం సహకరించక, రవాణా సౌకర్యంలేక తదితర కారణాల వల్ల ఓటు హక్కును  వినియోగించుకునేవారు కాదు.   ఇలా కనీసం 50 శాతం దివ్యాంగులు కూడా పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చే పరిస్థితులు లేకపోయేవి. దీన్ని గుర్తించిన ఎన్నికల సంఘం.. వారు ఓటు వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి దీనికి శ్రీకారం చుట్టగా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 76 శాతం మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార వర్గాల అంచనా. అంతేగాక గతంలో ఏడు రకాల వికలాంగులు, వ్యక్తుల కోసమే పోలింగ్‌ స్టేషన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు, మినహాయింపులు చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్యను 21కి పెంచారు.  

ఈ జాబితాలోని వారు ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చు  
అంధత్వం, తక్కువ దృష్టి, వినికిడి లోపం, చలన/శారీకర వైకల్యం, మానసిక వైకల్యం/బుద్ధిమాంధ్యం 
మానసిక రుగ్మత, యాసిడ్‌ దాడి బాధితులు, తలసేమియా, హెమోఫిల్ల (రక్తం గడ్డకట్టని స్థితి). 
మెదడు పక్షవాతం, ఆటిజం, బహుళ వైకల్యం, కుష్టువ్యాధి నయమైనవారు, మరుగుజ్జు, దీర్ఘకాలిక నరాల సమస్య, నరాల బలహీనత, కండరాల క్షీణత, నాడీ వ్యవస్థలో సమస్యలున్నవారు. 

ప్రత్యేక సదుపాయాలు ఇలా.. 
పోలింగ్‌బూత్‌ల వరకు దివ్యాంగులను తీసుకొచ్చి.. వారు ఓటు వేసిన తర్వాత తిరిగి వాహనంలో ఇంటికి చేర్చుతారు. ఈ రవాణా సదుపాయం ఉచితమే. 
ప్రతి పోలింగ్‌ కేంద్ర వద్ద ట్రైసైకిల్‌ అందుబాటులో ఉంటుంది. 
మూగ, చెవిటి ఓటర్లకు సైన్‌ లాంగ్వేజీ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పిస్తారు. 
పోలింగ్‌ కేంద్రాల్లోకి సులువుగా రాకపోకలు జరిపేందుకు ర్యాంప్‌లు నిర్మిస్తారు. 
అంధులకు సహాయంగా పోలింగ్‌ కేంద్రంలోకి ఒకరిని అనుమతిస్తారు.  
వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేస్తారు. 
పోలింగ్‌ కేంద్రాలకు అతి సమీపంలో వాహనాల పార్కింగ్‌ , గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు 
ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఒకరు చొప్పున వలంటీర్‌ను అందుబాటులో ఉంచుతారు. 

మరిన్ని వార్తలు