‘గ్లోబల్‌’ అతిథులకు ప్రత్యేక విందు 

10 Nov, 2017 04:19 IST|Sakshi

28న ఫలక్‌నుమాలో, 29న గోల్కొండ కోటలో విందులు: సీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌–2017కు హాజరు కానున్న విదేశీ అతిథులకు హైదరాబాద్‌ నగర చరిత్ర, సంస్కృతి, గత వైభవాన్ని తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో వారికి ప్రత్యేక విందులను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న ఈ సదస్సు ప్రారంభం కానుండగా, అదేరోజు విదేశీ అతిథులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో, 29న గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా  ట్రంప్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సహా 1,200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

సమ్మిట్‌ నిర్వహణ ఏర్పాట్లపై గురు వారం సచివాలయంలో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ పై విషయాన్ని వెల్లడించారు. 28న ప్రారంభోత్సవం ఉంటుందని, 29, 30 తేదీల్లో ప్లీనరీ సెషన్‌ మరియు ప్యానెల్‌ డిస్కషన్, వర్క్‌షాప్‌ మానిటరింగ్‌ క్లాసులు ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. సదస్సు నిర్వహణపై వచ్చేవారం మరో మారు సమావేశం అవుతామన్నారు. సదస్సును పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ సీఎస్‌కు వివరించారు.   
 

మరిన్ని వార్తలు