జిల్లాకు వచ్చిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి

15 May, 2020 12:16 IST|Sakshi
రాష్ట్ర సరిహద్దులో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్న అధికారులు (ఫైల్‌)

జిల్లాకు వచ్చిన వ్యక్తులపై ప్రత్యేక దృష్టి

హోం క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు

బయటకొస్తే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలింపు

ఆదిలాబాద్‌అర్బన్‌: కరోనా వైరస్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కోలుకుంది. జిల్లా ప్రజలు మాస్కులు ధరిస్తూ ఇళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. గత నెలలో ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన వారిలో పది మందికి పాజిటివ్‌ రాగా సెకండరీ కాంటాక్టు ద్వారా మరో 11మందికి సోకింది. మొత్తం 21మంది వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం ఒక్కొక్కరు కొలుకుని మొత్తం 21మంది డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు లేదు. లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం పక్షం రోజుల క్రితం అనుమతించిన విషయం తెలిసిందే. జిల్లాలోని వలస కూలీలు ఆయా ప్రాంతాలకు వెళ్లడం, ఇతర ప్రాంతాల్లోని మన వారు జిల్లాకు రావడం, ఇతర ప్రాంతాలకు మన ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా వెళ్లడం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా ఫ్రీ జిల్లాగా కుదుటపడడంతో మన జిల్లాకు వచ్చిన వ్యక్తులపై అధికారులు దృష్టి సారించారు.

936 మంది హోం క్వారంటైన్‌లో..
లాక్‌డౌన్‌కు ముందు మన జిల్లాకు చెందిన వ్యక్తులు ఆయా పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. లాక్‌డౌన్‌ అమలు కావడంతో దాదాపు నెల రోజులకుపైగా అక్కడే గడిపారు. ఆ తర్వాత సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఈ నెల 2నుంచి రాకపోకలు సాగుతున్నాయి. జిల్లా నుంచి బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాలకు వెళ్లగా అక్కడి నుంచి సైతం మన జిల్లాకు వస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు వచ్చిన వారిని, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని సరిహద్దు వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా అధికారులు రాష్ట్ర సరిహద్దు పెన్‌గంగా వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి ఈ నెల 3నుంచి వచ్చిపోయే వారిని స్క్రీనింగ్‌ చేస్తున్నారు. జిల్లా నుంచి వెళ్లే వారికి పాసులు జారీ చేయడంతో పాటు ఇక్కడకు వచ్చిన 3,700 మందికి స్టాంపింగ్‌ వేశారు. ఇందులో జిల్లాకు చెందిన వారు 936 మంది ఉండడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. మిగతా 2,764 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రస్తుతం కరోనా ఫ్రీ జిల్లాగా మారడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరూ బయట తిరగకుండా ప్రత్యేక అధికారులతో 24/7 నిఘా పెట్టారు. హోం క్వారంటైన్‌లో ఉన్న కొంత మంది వ్యక్తులు బయట తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సదరు వ్యక్తులు క్వారంటైన్‌లోనే ఉంటున్నట్లు సమాచారం.

హోం క్వారంటైన్‌లోనే ఉండాలి
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారు హోం క్వారంటైన్‌లోనే ఉండాలి. వారు బయట తిరుగకూడదు. ఒక వేళ తిరిగితే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించాల్సి ఉంటుంది. మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లగా మన జిల్లా చెందిన వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. కొందరు మన జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు.– సూర్యనారాయణ, ఆదిలాబాద్‌ ఆర్డీవో

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు