‘పెట్టుబడి’పై ప్రత్యేక గ్రామసభలు

26 Jan, 2018 01:31 IST|Sakshi

వ్యవసాయ శాఖ నిర్ణయం

సాగుకు యోగ్యంకాని భూములు గుర్తించేందుకు..

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూముల నిర్ధారణకు వచ్చే నెలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని వ్యవ సాయ శాఖ నిర్ణయించింది. ‘రైతులకు పెట్టుబడి సాయం’ పథకాన్ని సాగుకు యోగ్యమైన భూములకే వర్తింపజేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయడం, సీఎం చంద్రశేఖర్‌రావు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

రెవెన్యూ శాఖ నుంచి భూములు, రైతుల వివరాలు తీసుకుని ఆ ప్రకారం గ్రామసభలు నిర్వహించనుంది. ఆ సమాచారం పంపాల్సిందిగా రెవెన్యూ శాఖ ను కోరింది. వచ్చే నెల మొదటి వారంలోపు సమాచారం ఇస్తామని రెవెన్యూ శాఖ హామీ ఇవ్వడంతో రెండో వారంలో గ్రామసభలు నిర్వహించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి యూనిట్‌గా సభలు జరుగుతాయి.

ఓ రోజు సభ.. రెండ్రోజులు పరిశీలన..
రాష్ట్రంలోని 1.62 కోట్ల ఎకరాల సాగు భూమి ని పట్టా భూమిగా రెవెన్యూ శాఖ తేల్చింది. ఆ ప్రకారం వచ్చే ఖరీఫ్‌లో ఎకరాకు రూ. 4 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. సాగుకు యోగ్యం కాని భూమి ఉన్న రైతులకు సాయం అందిస్తే విమర్శలొచ్చే అవకాశం ఉందని, అలాంటి భూమికి సాయం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ భూములను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి వివరాలు, రైతు జాబితా ఆధారంగా గ్రామసభలు నిర్వహించనున్నారు.

సాగుకు యోగ్యంకాని పట్టా భూమిపై గ్రామ సభల్లో ఆరా తీసి ఆ భూమిని, రైతులను జాబి తా నుంచి తొలగిస్తారు. సంబంధిత భూమి రైతులు అంగీకరించకుంటే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు, సర్పంచ్‌ సమక్షంలో సాగు భూమా కాదా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ ఒక్కో గ్రామంలో 3 రోజులు జరుగుతుంది. రాష్ట్రవ్యా ప్తంగా 10 రోజుల్లో ప్రక్రియను ముగిస్తారు.  

ఆ భూమినీ సాగులోకి తెస్తామంటే?
సాగుకు యోగ్యంకాని ఓ మోస్తరు కొండలు, గుట్టలున్న భూమిని పెట్టుబడి సొమ్ముతో సాగులోకి తీసుకొస్తానని ఏ రైతైనా గ్రామసభలో చెబితే అంగీకరించాలని యోచిస్తున్నారు. తర్వాతి ఏడాది సాగులోకి తీసుకొచ్చేలా రైతు నుంచి హామీపత్రం తీసుకుని సాయం అందజేయనున్నారు. భారీ గుట్టలు, కొండలుంటే మాత్రం అంగీకరించకూడదని అధికారులు భావిస్తున్నారు. కొండలు, గుట్ట లను కంకర చేసి అమ్ముకొని తర్వాత నిర్ణీత ఏడాదిలో భూమిని సాగులోకి తెస్తానని ఎవరైనా ఆచరణాత్మక హామీ ఇస్తే సమ్మతించాలని యోచిస్తున్నారు. ఆ ప్రకారం మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముంది.

మరిన్ని వార్తలు