ఉత్తమ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంటు!

13 Oct, 2017 01:34 IST|Sakshi

ఉన్నత విద్యా మండలి కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉత్తమ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంటు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్సిటీల్లో పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచాలని నిర్ణయించింది. వర్సిటీ ల్లో కొత్త ఆవిష్కరణలకు చేయూతను ఇచ్చేందుకు ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయా లని భావిస్తోంది. బోధన, అభ్యసన విధానం లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడం, అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న సిలబస్‌లో మార్పులు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. విద్యార్థుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీలో(పీహెచ్‌డీ) నాణ్యత పెంచేందుకు డిపార్ట్‌మెంటల్‌ రీసెర్చ్‌ కమిటీలను, ఎక్స్‌టర్నల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీల ఏర్పా టు పరిశోధన అంశాలపై నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయా లని నిర్ణయించింది.

ఆ తర్వాతే పీహెచ్‌డీలు ప్రదానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే పీహెచ్‌డీలను అందించవచ్చని భావిస్తోంది. పీహెచ్‌డీల్లో మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు యూజీసీ మార్గదర్శకాలను పక్కాగా అమలుకు చర్యలు చేపడుతోంది. నకిలీ సర్టిఫికెట్ల నిరోధానికి పోలీసుల సహకారంతో వెబ్‌సైట్‌ను అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. బాగా పని చేసే అధ్యాపకులను ప్రోత్సహించేందుకు రివార్డు అండ్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఉత్తమ అధ్యాపక అవార్డులను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.  

మరిన్ని వార్తలు