మహా ఏర్పాట్లలో..

21 Sep, 2018 08:11 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

ప్రశాంత నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు

త్వరిత గతిన పూర్తయ్యేలా ప్రణాళిక

ఉదయం 6 గంటలకేఊరేగింపు ప్రారంభం

మధ్యాహ్నానికే ఖైరతాబాద్‌  మహా గణపతి నిమజ్జనం

సీపీ అంజనీకుమార్‌ వెల్లడి

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో కీలకఘట్టమైన నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బందోబస్తు కోసం 19 వేల మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. నగరమంతటా సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుందని సీపీ అంజనీకుమార్‌ గురువారం మీడియాకు తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం మధ్యాహ్నానికే పూర్తవుతుందని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది నిమజ్జనంలో వినియోగించే క్రేన్లకు అత్యాధునిక హుక్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి ఆటోమెటిక్‌గా రిలీజ్‌ అవుతాయి. తద్వారా ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఒక్కో క్రేన్‌ ద్వారా గంటకు 25 విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు.’ అని సీపీ వెల్లడించారు.

సాక్షి, సిటీబ్యూరో: గణేష్‌ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనం ఆదివారం జరుగనుండటంతో 19 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. గురువారం ఆయన నిమజ్జన ఏర్పాట్లను వివరించారు. నిమజ్జన ఘట్టాన్ని త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల బైండోవర్, వారిపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆదివారం అర్థరాత్రి లేదా సోమవారం తెల్లవారుజాములోగా నిమజ్జనం పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ మహా గణేషుడి నిమజ్జనం ఉరేగింపు ఉదయం 6 గంటలకే ప్రారంభమై, మధ్యాహ్నం 11.30 గంటలకు ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, హ్యాండ్‌ హెల్డ్‌ కెమెరాలతో ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు కేంద్రం, రాష్ట్ర సాయుధ బలగాలనూ మోహరిస్తున్నారు. ఆదివారం రాత్రి బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం  పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 

బందోబస్తు వివరాలివీ:  నగర పోలీసు విభాగంలోని నలుగురు అదనపు సీపీలు, ఒక జాయింట్‌ సీపీ, తొమ్మిది మంది డీసీపీలు, 20 మంది అదనపు డీసీపీలు, 64 మంది ఏసీపీలు, 244 మంది ఇన్‌స్పెక్టర్లు, 618 మంది ఎస్సైలు, 636 మంది ఏఎస్సైలు, 1700 మంది హెడ్‌–కానిస్టేబుళ్లు, 7198 మంది కానిస్టేబుళ్లు, 680 మంది ఎస్పీఓలు, 6000 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 17,174 మంది సిబ్బందికి తోడు 25 ప్లటూన్ల టీఎస్‌ఎస్పీ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి.

అదనపు బలగాలు:ఐదుగురు ఐజీలు, ఒక డీఐజీ, 19 ఎస్పీ/అదనపు ఎస్పీలు, 66 మంది డీఎస్పీలు, 128 మంది ఇన్‌స్పెక్టర్లు, 129 మంది ఎస్సైలు, ఆరుగురు మహిళా ఎస్సైలు, 1336 మంది ఏఎస్సై/హెడ్‌కానిస్టేబుళ్లు, 5239 మంది కానిస్టేబుళ్లు, 149 మంది మíహిళా కానిస్టేబుళ్లు, 1426 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 9382 మంది. వీరికి అదనంగా 45 ఏఆర్‌ ప్లటూన్లు, 5 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి.  
13 యూనిట్ల గ్రేహౌండ్స్, రెండు యూనిట్ల ఆక్టోపస్‌ బలగాలు అందుబాటులో ఉంటాయి.  
నిమజ్జనం, ఊరేగింపుల్లో 2000 వేల మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తల సహకారం తీసుకోనున్నారు.
నిరంతర నిఘా..  
నగరంలో ఉన్న 2.5 లక్షలకు తోడు అదనంగా 2 వేల సీసీ కెమెరాలు, మరో 600 హ్యాండ్‌హెల్డ్‌ కెమెరాలను వినియోగించనున్నారు.
500 మీటర్ల పరిధిలో ఫేషియల్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్‌ కెమెరాలు ట్యాంక్‌బండ్‌ చుట్టూ ఏర్పాటు చేశారు
సీసీ కెమెరాలను స్థానిక ఠాణా, జోనల్‌ కంట్రోల్‌ రూమ్, కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు డీజీపీ కార్యాలయంతో అనుసంధానం చేశారు.

ఈసారి అత్యాధునిక హుక్స్‌!
వినాయక చవితి నేపథ్యంలో గతేడాది హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్‌) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్స్డ్‌ హుక్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లోని 100 క్రేన్లకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు.  శ్రీచక్ర ఇంజినీరింగ్‌ సంస్థ నిర్వాహకుడు మురళీధర్‌ రూపొందించిన ఈ క్విక్‌ రిలీజ్‌ డివైజ్‌ (క్యూఆర్డీ) హుక్స్‌ ఈసారి ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లోని 38 క్రేన్లకు వాడుతున్నారు. గతేడాది  హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వినియోగించారు. క్రేన్‌ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్‌ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్‌ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్‌... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్‌ అవుతాయి. దీంతో గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తవుతుంది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్‌ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే... క్యూఆర్డీ హుక్స్‌ వినియోగించిన క్రేన్‌ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటిపై మరింత అధ్యయనం చేసిన మురళీధర్‌ అడ్వాన్స్డ్‌ వెర్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్‌ 15 కేజీల వరకు బరువు ఉండటంతో నిర్వహణ కష్టంగా మారడంతో దీనిని గరిష్టంగా 5.6 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్‌ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. హైదరాబాద్‌లో 38 (ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌), సైబరాబాద్‌లో 20, రాచకొండ పరిధిలో 25 క్రేన్లకు ఈ తరహా హుక్కులను ఏర్పాటు చేయనున్నారు.

45 రోజులుగా కసరత్తు
‘కీలక ఘట్టమైన నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడానికి 45 రోజులుగా కసరత్తు చేశాం. శుక్రవారం మెహర్రం ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని బందోబస్తు నిర్వహిస్తున్నాం. సోషల్‌మీడియా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా వచ్చే పుకార్లను నమ్మడం, ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడం చేయవద్దు. ఎవరికైనా ఇలాంటి సందేశాలు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నెక్లెస్‌రోడ్‌ ప్రాంతంలో అదనంగా హోల్డింగ్‌ ఏరియా కేటాయించాం. ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత వచ్చే విగ్రహాల వాహనాలను అక్కడికి పంపిస్తాం. పని దినమైన సోమవారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది నిమజ్జనంలో వినియోగించే క్రేన్లకు అత్యాధునిక హుక్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి ఆటోమెటిక్‌గా రిలీజ్‌ అవుతాయి. తద్వారా ఒక్కో విగ్రహం నిమజ్జనంలో 4 నుంచి 6 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఫలితంగా ఒక్కో క్రేన్‌ ద్వారా గంటకు 25 విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు. – అంజనీ కుమార్, సిటీ పోలీసు కమిషనర్‌

మరిన్ని వార్తలు