హుక్‌..క్విక్‌..

24 Sep, 2018 09:20 IST|Sakshi

క్యూఆర్డీ హుక్స్‌తో సత్ఫలితాలు

సాగర్‌ వద్ద వేగంగా గణేశుల నిమజ్జనం

గతంలో ఒక క్రేన్‌ ద్వారా గంటకు 12 విగ్రహాలు  

ఈ ఏడాది 25 నుంచి 30 వరకు పెరుగుదల

సాక్షి, సిటీబ్యూరో: గణేష్‌ విగ్రహాలకు జియో ట్యాగింగ్, ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ కేటాయింపుతో పాటు ఈసారి ట్యాంక్‌బండ్‌ చుట్టూ ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్‌) అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. క్విక్‌ రిలీజ్‌ డివైజ్‌ (క్యూఆర్డీ) పేరుతో నగరానికి చెందిన శ్రీచక్ర ఇంజనీరింగ్‌ సంస్థ నిర్వాహకుడు మురళీధర్‌ డిజైన్‌ చేసి ఈ హుక్స్‌ కారణంగా విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడం తేలికైంది. గతేడాది ప్రయోగాత్మకంగా వాడిన ఈ హుక్స్‌ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో వినియోగించారు.

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న 38 క్రేన్లకు వీటిని ఏర్పాటు చేశారు. క్రేన్‌ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్‌ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్‌ చేస్తున్నారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్‌... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్‌ అవుతాయి. విగ్రహాన్ని ఎక్కించే సమయాన్ని మినహాయిస్తే గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తవుతోంది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీ–లింక్‌ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్‌ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేయగా, క్యూఆర్డీ హుక్స్‌ వినియోగించిన క్రేన్‌ ఇతే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది.

>
మరిన్ని వార్తలు