ఉందిలే మంచికాలం ముందు.. ముందునా!

10 May, 2020 03:14 IST|Sakshi

త్వరలోనే కరోనా సంక్షోభం నుంచి బయటపడతాం

రెండు, మూడేళ్లలో స్థిరాస్తి, నిర్మాణ రంగాల పురోగతి

ఏటా సగటున 3–4 కి.మీ. మేర నగరం విస్తరణ

గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ప్రభుత్వాలు ఊతమివ్వాలి

‘సాక్షి’తో సుచిర్‌ ఇండియా సీఈఓ డాక్టర్‌ కిరణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా సంక్షోభానికి ఆర్నెల్ల ముందే ఆర్థిక పరిస్థితి ప్రపంచంతో పాటు భారత్‌లో కూడా మందగమనంతో సాగుతూ వచ్చింది. దీంతో మనం కరోనాకు ముందు, ఆ తర్వాతి పరిస్థితులను శాస్త్రీయంగా సమీక్షించుకోవాలి. 2022 లేదా 2023 నాటికి ఉండే పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకెళ్లాలి. మనకు సహజ వనరులుండటం అనుకూలించే అంశం. గతంలో కరువు నుంచి వ్యవసాయ రంగం గట్టెక్కినట్టే ప్రస్తుత సంక్షోభం నుంచి ఉత్పత్తి, సేవా రంగాలు తిరిగి పుంజుకుంటాయి. రాబోయే రోజుల్లో ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్థిరాస్తి, నిర్మాణ, ఆతిథ్య రంగాలు మరింత పురోగతి సాధిస్తాయి’అని సుచిర్‌ ఇండియా సీఈఓ లయన్‌ డాక్టర్‌ వై.కిరణ్‌ అంటున్నారు. కరోనా తర్వాత ఎదురయ్యే పరిణామాలపై ‘సాక్షి’తో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

‘సాగు’కు అండగా నిలవాలి...
దేశంలో ఇప్పటికీ 50 శాతం వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది. గతంలో వరుసగా రెండు, మూడేళ్ల పాటు కరువొచ్చినా ఈ రంగం తిరిగి పుంజుకుంది. ఈ ఏడాది తెలంగాణ, ఏపీ సహా తమిళనాడు, పంజా బ్, ఉత్తరప్రదేశ్‌లో వ్యవ సాయ రంగం పురోగతి సాధిస్తోంది. ప్రభుత్వం ఈ రంగానికి అండగా నిలిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. ఇదే తరహాలో ఉత్పత్తి, సేవా రంగాలూ పుంజుకుంటాయి. భారతీయ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ఆర్థికరంగం వాటానే ఎక్కువ.

గతంలో నోట్ల రద్దు సందర్భంగా ప్లాస్టిక్‌మనీ, నగదు బదిలీ వంటి వాటితో గ్రామీణ, ఎంఎస్‌ఎంఈ రంగాలు ఇబ్బందులు పడతాయని లెక్కలు వేశా రు. కానీ అవేవీ అంతగా ప్రభావం చూపలేదని తేలింది. వీటికి సులభతర కార్యకలాపాల నిర్వహణకు మరింత వెసులుబాటునివ్వాలి. పెద్ద పరిశ్రమల మనుగడకు జీఎస్‌టీ నిబంధనల సడలింపు, రుణాల వసూలుపై మారటోరియం వంటివి అమలుచేయాలి. సెమీ అర్బన్, అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం సులభతర వాణిజ్య విధానాలు అమలయ్యేలా చూడాలి. హెలికాప్టర్‌ మనీ ఆలోచన మంచిదే కానీ సరైన పర్యవేక్షణ లేకుంటే వియత్నాం తరహా ప్రతికూల ఫలితాలు వస్తాయి.

దేశానికి కొత్త జవసత్వాలు 
దేశ జనాభాలో 25 – 40 మధ్య వయస్కులు 50 శాతానికి పైగా ఉన్నారు. వీరికి భవిష్యత్తు ప్రణాళికలపై రిస్క్‌ తీసుకునే మనస్తత్వం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ వనరులతో పాటు ఇతర అవసరాలకు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. కానీ మన వద్ద ఖనిజాలు, లోహాలు, చమురు, ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధి సాధించాం. మరోవైపు జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుంటే మన ఆర్థిక వ్యవస్థ పురాతనమైనది కావడం ప్రస్తుత సంక్షోభంలో అనుకూలించే అంశం. దేశానికి కొత్త జవసత్వాలనిచ్చేందుకు ఇదే మంచి సమయం. రూపాయి బలోపేతానికి అనుసరించాల్సిన మార్గాలపై కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అండగా నిలిస్తే ఉత్పత్తి, సేవా రంగాలు ఆరు నెలల్లో గాడినపడతాయి.

వలసలు పదింతలు..  
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం విషయానికొస్తే.. నిర్మాణ, ఇతర రంగాల్లో పనిచేసేందుకు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే కార్మికుల సంఖ్య వచ్చే పదేళ్లలో పదింతలు కావచ్చు. ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో హైదరాబాద్‌ సాధిస్తున్న పురోగతే దీనికి కారణం. దీంతో నగరం ఏటా 3–4 కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశం ఉంది. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం విశాలమైన రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం భూమికి డిమాండ్‌ పెరుగుతుంది. దిగువ, మధ్య తరగతి కుటుంబాలు తమ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులు పెడుతుంటాయి. బయ్యర్‌ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇదే అత్యంత అనుకూల సమయం.

‘వర్క్‌ ఫ్రం హోం’ నడవదు
ఐటీ రంగం ఇప్పటికే నష్టపోగా, మరో రెండు నెలలు దానిపై కరోనా సంక్షోభ ప్రభావం ఉంటుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం వాటా 17 శాతం కాగా ఇందులో ఐటీ రంగం వాటా కొద్ది మాత్రమే. కాబట్టి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, పింక్‌ స్లిప్‌ల జారీ వంటివి పెద్దగా ప్రభావం చూపవని అంచనా. ఈ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోం సంస్కృతి కొనసాగకపోవచ్చు. డేటా సెక్యూరిటీ, పనిలో నాణ్యత వంటివి దృష్టిలో పెట్టుకుని ఆఫీసు నుంచే పనిచేయాలి. ప్రస్తుతం ఒక్క ఉద్యోగికి వంద చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున ఆఫీస్‌ స్పేస్‌ ఉండగా, భౌతికదూరం నిబంధన నేపథ్యంలో 150 చదరపు అడుగులకు విస్తరించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరంలో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. మరోవైపు అమెరికా, యూరోప్‌లోని చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు ప్రస్తుత సంక్షోభం తర్వాత ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించొచ్చు. ఆతిథ్య రంగంలోనూ భౌతికదూరం నిబంధనతో నిర్మాణరంగానికి డిమాండ్‌ పెరగొచ్చు.

మరిన్ని వార్తలు