ఏడాదికి నాలుగు డైరీలు

24 Feb, 2017 00:58 IST|Sakshi
ఏడాదికి నాలుగు డైరీలు

సోహ్రాబుద్దీన్‌ కేసు భయంతో పాత డైరీలు తగులబెట్టిన నయీమ్‌
2010 నుంచి అందుబాటులో ఉన్న 25 డైరీలు
సునిశితంగా దర్యాప్తు చేస్తున్నామన్న సిట్‌ అధికారులు


సాక్షి, హైదరాబాద్‌: నయీమ్‌ కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలపై సిట్‌ అధికారులు కొద్ది రోజులుగా దర్యా ప్తు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచ లనం రేపిన డైరీలు, అకౌంట్‌ పుస్తకాలపై ఇప్పు డిప్పుడే స్పష్టత వస్తోందని సిట్‌ అధికా రులు తెలిపారు. ఏటా నాలుగు డైరీలు నయీమ్‌ రాసే వాడని, వాటితో నాలుగు అకౌంట్‌ పుస్త కాలు మెయింటెయిన్‌ చేసేవాడని అతడి భార్య, అను చరులు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.

ఎవరెవరికి ఎంత ఇచ్చిందీ...
నయీమ్‌ 2010 వరకు రాసిన డైరీలను తగులబెట్టినట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. 2005లో ఎన్‌కౌంటర్‌ అయిన సోహ్రాబుద్దీన్‌ వ్యవహారంలో తన పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో భయాందోళనకు గురైన నయీమ్‌ 2010 వరకు రాసుకున్న డైరీలను తగులబెట్టినట్టు అతడి అనుచరులు విచారణలో వెల్లడించినట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. అయితే 2010 తర్వాత ఏటా నాలుగు డైరీలు మళ్లీ రాశాడని, ఇలా ఓ 25 డైరీలుంటాయని పేర్కొ న్నారు. సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చిన డబ్బు, జీతభత్యాలుగా చెల్లించిన ఖర్చు, ఎక్కడెక్కడ ఎవరెవరికీ ఎంత ఇచ్చాడో అన్ని వివరాలను నాలుగు అకౌంట్‌ బుక్కుల్లో రాసుకునేవాడని చెబుతున్నారు.

ఒక డైరీలో సెటిల్‌మెంట్లు చేసిన తీరు, ఎంత భూమి ఎంత ధరకు కొన్నాడో తదితర వివరాలను రాసుకున్నాడని సిట్‌ అధికారులు తెలిపారు. మరో డైరీలో సెటిల్‌మెంట్ల ద్వారా వచ్చిన డబ్బులను అధికారులకు, తన అనుచరులకు ఇచ్చిన తేదీలు, ప్రాంతాలను రాసుకున్నాడని, మూడో డైరీలో తనను ఎవరెవరు ఎప్పు డెప్పుడు కలిశారు... ఎందుకు కలిశారన్నది రాసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నాలుగో డైరీలో తాను చంపాలనుకున్న, చంపిన వారి జాబితా రాసుకున్నాడు.

చిన్నన్నతో మరుపురాని అనుభూతి
ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఓ డీఎస్పీతో నయీమ్‌ దిగిన ఫొటోలు 28 ఉన్నట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. ఆ డీఎస్పీని చిన్నన్నగా నయీమ్‌ భావించేవాడు. చిన్నచిన్న ఫంక్షన్లకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వీరు ఒకరిళ్లకు ఒకరు తరచూ వచ్చిపోతుండేవారు. ఇలా చిన్నన్న రావడం మరుపురాని అనుభూతి అని నయీమ్‌ తన డైరీలో తేదీలతో సహా రాసుకున్నట్టు సిట్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు కేసులు, ఆధారాల సేకరణకు సమయం తీసుకున్న సిట్‌.. లభించిన ఆధారాలను అధ్యయనం చేసి, సంబంధిత అధికారుల దర్యాప్తు కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.
 

>
మరిన్ని వార్తలు