ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

11 Dec, 2014 23:22 IST|Sakshi
ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
 
పాపన్నపేట: ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా...ఆధ్యాత్మిక నిలయంగా మారుస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆమె హైదరాబాద్ - ఏడుపాయల బస్సును ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. ఏడుపాయల అభివృద్ధికోసం ఇప్పటికే ఓ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అందుకనుగుణంగా పనులు  ప్రారంభించినట్లు చెప్పారు.

రోడ్డు వెడల్పు కోసం పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఏడుపాయల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కాటేజీలు నిర్మిస్తామన్నారు. ఘనపురం ఆనకట్టను అభివృద్ధి చేసి పర్యటన క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. స్నానఘాట్లు ఏర్పాటు చేస్తామని, హోమశాల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మెదక్ జిల్లాలో తాగునీటికోసం మూడు గ్రిడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహారభద్రత కార్డులు అందజేయనున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పింఛన్ల పంపిణీ
ఏడుపాయల దుర్గమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మిన్‌పూర్‌లో తాగునీటి పథకానికి శంకుస్థాపన, తమ్మాయిపల్లిలో పింఛన్ల పంపిణీ, చీకోడ్, కొంపల్లి, రాంతీర్థం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ స్వప్న, టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్, కోకన్వీనర్, ఆశయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకట్రాములు, విజయలక్ష్మి , ప్రతాప్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఈఓ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, మంగ రమేష్, చింతల నర్సింలు తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు