‘యాప్‌’న్న హస్తం

5 May, 2020 07:32 IST|Sakshi
అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద పాసుల కోసం నిరీక్షిస్తున్న వలస కార్మికులు

ప్రత్యేకంగా రూపొందించిన రాష్ట్ర పోలీసు విభాగం

దీని ద్వారానే కూలీల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

సొంత ప్రాంతాలకు పంపించేందుకు ఏర్పాటు

పేర్ల నమోదుకు పోలీస్‌స్టేషన్ల వద్ద వందలాది మంది

నేడు బిహార్‌కు తొలి రైలు వెళ్లే అవకాశం   

నిర్మాణ పనుల ప్రారంభంతో పలువురికి కౌన్సెలింగ్‌

ఇక్కడే ఉంచేందుకు అధికారుల ప్రయత్నాలు  

ఇప్పటికే నడక దారిన స్వస్థలాలకు వెళ్తున్న కార్మికులు

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో చిక్కుకుపోయి, స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న వలస కార్మికుల కోసం రాష్ట్ర పోలీసు విభాగం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘టీఎస్‌ పోలీసు పాస్‌ మేనేజ్‌మెంట్‌’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌ ద్వారానే వలస కార్మికుల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పోలీస్‌స్టేషన్ల వద్ద వందలాది మంది వలస కూలీలు బారులు తీరుతున్నారు. మంగళవారం నగరం నుంచి బిహార్‌కు తొలి రైలు బయలుదేరే అవకాశముంది. మరోవైపు సోమవారం నాటికే చాలామంది కూలీలు మూటా ముల్లే సర్దుకుని కాలినడకన స్వస్థలాలకు వెళ్లారు. నగరంలో నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వీలున్నంత మందిని నిలువరించేందుకు అధికారులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.  

ఒక్కో రైలులో 1200 మంది..
వలస కార్మికుల్ని తరలించడానికి కేంద్రం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. ఒక్కో రైలులో గరిష్టంగా 1200 మందిని తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో వీరు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎవరికి వారు తాము వెళ్తామంటే తాము వెళ్తామంటూ పోలీసుస్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద బారులుదీరుతున్నారు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యలను తప్పించడానికి పోలీసు విభాగం ఠాణాల వారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టింది. ఇందుకోసం రూపొందించిన ‘టీఎస్‌ పోలీసు పాస్‌ మేనేజ్‌మెంట్‌’ యాప్‌ను ఆయా ఇన్‌స్పెక్టర్ల ఫోన్లలో నిక్షిప్తం చేశారు. దీని ద్వారా ఆయా అధికారులు వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్ర క్రియ చేపడుతున్నారు. దాదాపు అన్ని ఠాణాలకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఒత్తిడి ఎక్కువ ఉన్న చోట్ల అదనపు ఇన్‌స్పెక్టర్లు సైతం రంగంలోకి దిగారు.

సమన్వయకర్తల సాయంతో..
ఆయా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు కొందరు సమన్వయకర్తలు ఉన్నారు. ప్రధానంగా మేస్త్రీలు, కులపెద్దలు తదితరులు ఈ పాత్ర పోషిస్తున్నారు. వీరి సాయంతో కార్మికులు ఉండే ప్రాంతానికి వెళ్తున్న పోలీసులు ఈ యాప్‌లో వారి పేరు, ఆధార్, ఫోన్‌ నంబర్, స్వరాష్ట్రం, జిల్లా తదితర వివరాలు నింపుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారి వివరాలు ఇలా నమోదు చేసుకుంటున్నారు. ఆది, సోమవారాల్లో మూడు కమిషనరేట్లకు సంబంధించి 25 వేల మంది వివరాలు నమోదు చేశారు. ఈ డేటాబేస్‌ ఆధారంగా ఆరోహణ క్రమంలో రాష్ట్రాల వారీగా కార్మికులు, కూలీలను పంపనున్నారు. ఓ రాష్ట్రానికి వెళ్లడానికి రైలు సిద్ధమైన తర్వాత ఆ రాష్ట్రీయుల్లో మొదట ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన 1200 మందికి సంక్షిప్త సందేశాలు వస్తాయి. రైలు బయలుదేరడానికి నిర్ణీత సమయం ముందు వచ్చే వీటిని స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి చూపించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ప్రింటెడ్‌ పాస్‌ను జారీ చేసే ఠాణా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్సులో రైల్వే స్టేషన్‌కు తరలిస్తారు. ఆది, సోమవారాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో బిహార్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో మంగళవారం తొలి రైలు ఆ రాష్ట్రానికే బయలుదేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

రోడ్లపైకి భారీ సంఖ్యలో..  
ఇటీవల సంగారెడ్డిలో చోటుచేసుకున్న ఘర్షణ, ఆ తర్వాత రహస్యంగా లింగంపల్లి నుంచి ఓ రైలు ఏర్పాటు కావడం తదతర పరిణామాలతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. రోడ్లపైకి వస్తే తప్ప తమను పంపించరనే ఉద్దేశంతో అనేక మంది వలస కార్మికులు ఆదివారం నుంచి నిరసనలకు దిగడం, పోలీసుస్టేషన్లకు వెళ్లి వాగ్వాదానికి దిగుతున్నారు. మరికొందరు మూటాముల్లే సర్దుకుని కాలి నడకనే స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వీలున్నంత వరకు వలస కార్మికులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. వీరున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆహారం అందించడం, నిర్మాణాలను ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అందరికీ పని దొరుకుతుందంటూ వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆలోపు ఆహారం, వైద్యం తదితర సౌకర్యాలు కల్పిస్తూ వారిలో నమ్మకం కలుగజేస్తున్నారు. మండుటెండల్లోనూ కాలినడకన వెళ్లిపోతున్న వలస కార్మికుల్ని ఎక్కడిక్కడ ఆపి.. అధికారులు  కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. 

వచ్చేవారికి వైద్య పరీక్షలు..
మరోవైపు సిటీ నుంచి ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు వెళ్తున్నట్లే.. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడకూ వచ్చే అవకా«శం ఉంది. అలా వచ్చే వారిలో కరోనా పాజిటివ్‌ వ్యక్తులు ఉంటే ఆ ప్రభావం నగరంపై తీవ్రంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్లలోనే ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారుల సాయంతో ప్రాథమిక పరీక్షలు చేయాలని యోచిస్తున్నారు. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలను రికార్డులు రూపొందించనున్నారు. అనుమానిత లక్షణాలున్న వారికి నిర్ణీత కాలానికి హోం క్వారంటైన్‌ స్టాంపులు వేయాలని, వారు బయటకు రాకుండా నిఘా ఉంచాలని యోచిస్తున్నారు. మొత్తమ్మీద ఈ రాకపోకల కారణంగా ఎలాంటి అపశ్రుతులు, దుష్పరిణామాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ  తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు