విద్యార్థినులకు ప్రత్యేక పౌష్టికాహారం

22 Jun, 2018 02:39 IST|Sakshi

రక్తహీనత, పౌష్టికాహార లోపాల్ని అధిగమించాలి

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినుల్లో ఎక్కువ మంది రక్తహీనత, పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ లోపాన్ని అధిగమించేందుకు ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్‌తో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఇందుకు షెడ్యూల్‌ రూపొందించుకోవాలన్నారు.

గురువారం సచివాలయంలో గురుకుల సొసైటీ కార్యదర్శులు, విద్యా శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. బాలికలకు పౌష్టికాహారంలో భాగంగా బెల్లంతో చేసిన పల్లీ పట్టీలు, నువ్వుల పట్టీలను స్నాక్స్‌ రూపంలో ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ఉదయం రాగిమాల్ట్, పాలు, అల్పాహారం ఇవ్వడంతో పిల్లల ఆరోగ్యం కొంత మెరుగుపడిందన్నారు. మధ్యాహ్న భోజనంలో 50 గ్రాముల నెయ్యి, రాత్రి పూట మంచి భోజనం ఇస్తున్నామని తెలిపారు.

దీనివల్ల గురుకుల విద్యార్థులలో చురుకుదనం పెరిగిందని, ఆరోగ్యం బాగుండటం వల్ల చదువు కూడా బాగా చదువుతున్నారన్నారు. నీట్, జేఈఈ పరీక్షల్లో తెలంగాణ గురుకుల, మోడల్‌ స్కూల్, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచే వారికి కోచింగ్‌ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వ విద్యా సంస్థల్లోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌ జూలై నుంచి అందిస్తున్నామని, ఇందులో బాలికలకు అవసరమైన 13 రకాల 50 వస్తువులున్నాయన్నారు.

ఇవన్నీ బ్రాండెడ్‌ కంపెనీల నుంచే కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభు త్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్‌ ఆచార్య, సాం ఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్, బీసీ సంక్షేమ గురుకులాల డైరెక్టర్‌ భట్టు మల్లయ్య, మైనారిటీ గురుకులాల డైరెక్టర్‌ షఫీ యుల్లా, విద్యాశాఖ గురుకులాలు, మోడల్‌ స్కూళ్ల డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు