ప్రత్యేక ప్యాకేజీ

20 May, 2016 01:48 IST|Sakshi
ప్రత్యేక ప్యాకేజీ

అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, రిజర్వాయర్ నిర్మాణాల్లో నష్టపోయిన బాధితరైతులకు ప్రత్యేకప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భరోసాఇచ్చారు. వారం రోజుల్లో మీ వద్దకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు ఇంజనీరింగ్ అధికారులను పంపిస్తామని, మరో 15రోజుల్లో నిర్వాసితుల రైతులందరికీ పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. గురువారం రాత్రి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి గ్రామ రైతులతో మాట్లాడారు.


 పేదలకు మెరుగైన వైద్యసేవలు
రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. వివాహం చేయలేక ఆడపిల్ల పుట్టగానే చంపివేస్తున్న ఈ రోజుల్లో వారి పెళ్లిల కోసం కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చి రూ.51వేలు ఇస్తుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అచ్చంపేటలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్స్ మంజూరుచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్కో పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రులను బాగుచేస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తున్నామని, రైతులకు 9గంటల విద్యుత్ ఇస్తూనే 24గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ కసిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఎంపీపీ ఎం.పర్వతాలు, చైర్మన్ కె.తులసీరాం, వైస్ చైర్మన్ బంధం రాజు, టీఆర్‌ఎస్ నాయకులు పి.మనోహర్, సీఎం రెడ్డి, ఎడ్ల నర్సింహాగౌడ్, రాంబాబునాయక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు